లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ఆసుపత్రులపై చట్టరీత్యా చర్యలు మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ఆసుపత్రులపై చట్టరీత్యా చర్యలు

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులు, స్కానింగ్​ సెంటర్లలో లింగనిర్ధారణ  పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఈ విషయంలో భ్రూణహత్యలు నివారించి ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి అన్నారు.

గురువారం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సమావేశంలో  గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగనిర్ధారణ ప్రక్రియ నిషేద చట్టం –1994పై అధికారులతో మాట్లాడుతూ  జిల్లాలోని ఆసుపత్రుల్లో గర్భిణులకు పుట్టబోయేది ఆడబిడ్డా, మగబిడ్దా అని తెలుసుకోవడానికి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే అది చట్టరీత్యా నేరమని గుర్తించాలన్నారు. ఈ విషయంలో ఆసుపత్రి యాజమాన్యాలు పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అందరికీ తెలిసేలా కరపత్రాలు ముద్రించి శిక్షణనివ్వడంతో పాటు జిల్లా పోలీసు అధికారుల సహకారంతో రహస్య ఆపరేషన్లు, తనిఖీలు నిర్వహించాలని షీ టీమ్స్​ను కూడా ఇందులో చేర్చుకొని వారి సేవలను సైతం వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. అలాగే లింగ నిర్ధారణ నిషేదమనే విషయాన్ని గర్భిణితో పాటు వారి కుటుంబసభ్యులు ఆసుపత్రి యాజమాన్యాలను అడగరాదని అలా అడిగితే చట్టరీత్యా శిక్షార్హులవుతారని తెలియజేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టబోయే ఆడపిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టం ప్రవేశపెట్టిందని ఆడపిల్లలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. . లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి అన్ని ప్రైవేట్​, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, పరీక్షలు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్​ మల్లికార్జున్​రావు, రాచకొండ క్రైమ్​ బ్రాంచి డీసీపీ యాదగిరి, లీగల్​ సర్వీసెస్​ అథారిటీ జిల్లా సెక్రెటరీ శ్రీదేవి, డిప్యూటీ జిల్లా ఎక్స్​టెన్షన్​ అండ్​ మీడియా ఆఫీసర్​ వేణుగోపాల్​రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post