లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి. 2022-23 సం.నికి త్రైమాసిక సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, లీడ్ బ్యాంక్ మేనేజర్ అమూల్ పవార్

పత్రికా ప్రకటన.   తేది:23.09.2022, వనపర్తి.

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు, వీధి వ్యాపారులకు సకాలంలో రెండవ విడత రుణాలు అందించి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని  బ్యాంక్ అధికారులకు  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
శుక్రవారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి. 2022-23 సం.నికి త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు వీధి వ్యాపారులకు రెండవ విడత అందించాల్సిన రుణాలపై, బ్యాంకర్లు ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే రుణాలపై విస్తృత ప్రచారం చేసి, ప్రజలలో అవగాహన కల్పించి ప్రభుత్వ రుణాలను సకాలంలో అందజేయాలని ఆమె తెలిపారు. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు 100 శాతం రుణాలు అందించేలా బ్యాంకర్లు కృషి చేయాలని ఆమె తెలిపారు. వినియోగదారులు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకు అధికారులకు ఆమె సూచించారు.
వీధి విక్రయదారులకు బ్యాంకుల ద్వారా రెండవ విడత రూ. 50,000/- లు రుణాలు అందించాలని, మున్సిపాలిటీ పరిధిలో వీధి విక్రయదారుల సౌలభ్యం కొరకు విక్రయదారుల జోన్ ఏర్పాటు చేశారని, విక్రయదారులు అందులో వారు వ్యాపారం కొనసాగించేలా చూడాలని ఆమె అన్నారు. రైతులకు కొత్త రుణాలు అందజేసేలా బ్యాంకర్లు తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి మూడవ శుక్రవారం రైతులతో బ్యాంకర్లు సమావేశాలు నిర్వహించి రుణాలపై చర్చించాలని ఆమె తెలిపారు. బ్యాంకుల ఇన్ఫ్రా స్ట్రక్చర్ తక్కువగా ఉన్నదని సెప్టెంబర్ 30వ.తేదిలోపు సబ్సిడీ రుణాల మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల కొరకు దరఖాస్తు చేసుకున్న వాటిని పెండింగ్లో ఉంచరాదని, వెంటనే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ హెచ్ జి గ్రూపుల బ్యాంకు లింకేజీ, కొత్త సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఏపీజీవీబీ పెండింగ్ రుణాలు లేకుండా చెల్లించాలని ఆమె ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ లోన్లు పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలన్నారు.
జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతు వేదికల వద్ద రైతులతో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకొని, రుణాలు ఇతర సమస్యలపై చర్చించాలని, మహిళా సంఘాలకు సంబంధించి రుణాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని ఆయన అన్నారు. బ్యాంకర్లు రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని, మరిన్ని సేవలు అందించేలా వారు కృషి చేయాలన్నారు. మత్స్య పరిశ్రమ, కోళ్ల పరిశ్రమపై బ్యాంకర్లు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఏ.ఎన్. అమూల్ పవార్ మాట్లాడుతూ రుణాల మంజూరులో వీధి విక్రయదారులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోవద్దని, బ్యాంకులు సత్వరమే రుణాలు మంజూరు చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ అమూల్ పవార్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, మహిళా సంఘాల అధ్యక్షులు, జిల్లా అధికారులు, వీధి విక్రయదారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
_____
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post