లే అవుట్లలో ఓపెన్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

 

ఖమ్మం, జూన్ 8:

లే అవుట్లలో ఓపెన్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ బుధవారం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి, లే అవుట్లు, కెనాల్ బండ్ లు, పారిశుద్ధ్య తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పోలేపల్లి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా యువత ఇష్టపడే క్రీడలకు సంబంధించి కోర్టులు ఏర్పాటుచేయాలన్నారు. క్రీడా ప్రాంగణాల చుట్టూ ఫెన్సింగ్ వెంబడి మొక్కలు నాటాలన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. గ్రామంలో ఎన్ఎస్పి కెనాల్ ను పరిశీలించారు. కెనాల్ వెంబడి ఇరువైపుల పిచ్చి మొక్కలు, పొదలు తొలగించి, శుభ్రం చేసి, మల్టి లేయర్ లో గుంతలు త్రవ్వించాలని, మొక్కలు నాటుటకు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. మొక్కలు నాటుటకు ఉపాధి హామీ ద్వారా ఉపాధి హామీ కూలీలకు పని దొరుకుతుందని ఆయన తెలిపారు. గ్రామంలో నిర్మాణ తుది దశలో వున్న రెండు పడక గదుల ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, పరిసరాలు శుభ్రం చేయించాలని, చిన్న చిన్న పనులు ఏమైనా వుంటే, త్వరగా పూర్తిచేసి, ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలన్నారు. ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని ఆయన తెలిపారు. అనంతరం కలెక్టర్ పల్లెగూడెం-రోళ్ళపాడు రోడ్ వద్ద ఎన్ఎస్పి కెనాల్ పరిశీలించారు. కెనాల్ బండ్ వెంబడి శుభ్రం చేయాలని, మల్టి లేయర్ లో మొక్కలు నాటుటకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. అనంతరం కలెక్టర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను తనిఖీ చేశారు. బడి బాట కార్యక్రమ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు గ్రామంలో తిరుగుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు స్వీకారం చుడుతున్నట్లు, ప్రయివేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపించి, ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దని, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో, నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేలా అవగాహన కల్పించాలన్నారు. సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లెగూడెం ఎన్ఎస్పి కెనాల్ పరిశీలించారు. హరితహారం క్రింద మొక్కలు నాటుటకు చర్యలు చేపట్టాలన్నారు. అక్కడే వున్న నూతన వెంచర్ ను కలెక్టర్ పరిశీలించారు. కెనాల్ బండ్ కు దగ్గరలో ఉన్నందున ఇర్రిగేషన్ అధికారుల సూచనలు తీసుకొని, అనుమతుల విషయమై చర్యలు తీసుకోవాలన్నారు. డెవలప్మెంట్ రుసుము వస్తున్నది, వస్తే ఎంత మేర వస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ స్థలంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం/పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అక్కడి నుండి గుర్రాలపాడు వద్ద నున్న వెంచర్ ను పరిశీలించారు. గ్రీన్ బెల్ట్ క్రింద వదిలిన ఖాళీ స్థలంలో క్రీడా ప్రాంగణం/పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. పల్లె ప్రకృతి వనం కొరకు అయితే, పిట్టింగ్ చేసుకొని హరితహారానికి సిద్దంగా వుండాలని, తెలంగాణ క్రీడా ప్రాంగణాలయితే వెంటనే పనులు ప్రారంభించి, పూర్తిచేయాలన్నారు. ఇట్టి పనులు ఈ విడత పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తగు లోపు పూర్తిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ చిన్న వెంకటగిరి లోని తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. గ్యాప్స్ వున్న చోట, చనిపోయిన మొక్కల స్థానే క్రొత్త మొక్కలు నాటాలన్నారు. అధికారులు లక్ష్యం మేరకు వ్యక్తిగత శ్రద్ధతో పనులు పూర్తిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిణి జ్యోతి, టీఎస్ఇడబ్ల్యుఐడిసి ఇఇ జె. నాగశేషు, ఖమ్మం రూరల్ మండల ఎంపిడివో అశోక్ కుమార్, తహసిల్దార్ సుమ చౌదరి, విద్యుత్ శాఖ డిఇ రామారావు, డిఎల్పివో పుల్లారావు, మిషన్ భగీరథ ఏఇ వెంకటేశ్వర్లు, ఎంపిఓ శ్రీనివాస రావు, సర్పంచులు నాగరత్నమ్మ, ముత్తయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post