లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి….8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నీలిమ

రాజీ మార్గమే రాచ మార్గమని రాజీ కుదుర్చుకునే అవకాశాలున్న కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవలసినదిగా మెదక్ జిల్లా ఇంచార్జి 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నీలిమ సూచించారు. శుక్రవారం జిల్లా సెషన్స్ కోర్టులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ డిసెంబర్ 11 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలనదిగా కోరారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృధా చేసుకోకూడదని ఉద్దేశంతో ప్రతి రెండు మాసాలకొకసారి లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా డిసెంబర్ 11 న శనివారం కోర్టు ఆవరణలో నిర్వహించు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ లోక్ అదాలత్ లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వహణ కేసులు, వైవాహిక సంబంధమైన కేసులు, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార కేసులు, బ్యాంక్ రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ చేయదగ్గ కేసులను పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. ప్రధానంగా ఈ లోక్ అదాలత్ పెద్ద మనసుతో క్షమించి రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారమయ్యే విధంగా చూస్తుందని అన్నారు. సివిల్ తగాదాలో రాజీ మార్గం ద్వారా పరిష్కారమైతే కోర్టు ఫీజు కూడా వెనుకకు తీసుకునే అవకాశముందని ఆమె తెలిపారు. దీనిని కక్షిదారులు న్యాయవాదులు, పొలిసు అధికారులు, బ్యాంకులు, విద్యుత్, తదితర అధికారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవలనదిగా ఆమె సూచించారు. ఈ లోక్ అదాలత్ లో 139 కేసులు పరిష్కార దిశగా గుర్తించామని, ఆ నాటికి మరికొన్ని కేసులు పరిష్కారమయ్యేలా చూస్తామని నీలిమ తెలిపారు.
ఈ ప్రెస్ మీట్ లో జూనియర్ సివిల్ జడ్జ్ రీటా లాల్ చంద్, స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ కల్పన తదితరులు పాల్గొన్నారు.

Share This Post