వందశాతం కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు చేపట్టండి- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ .

సెప్టెంబర్ 16, 2021ఆదిలాబాదు:-

కోవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం జరిగేలా ప్రణాళికలు రూపొందించుకొని పూర్తీ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. గురువారం రోజున ఉదయం కలెక్టర్ లు, జిల్లా వైద్య శాఖ అధికారులతో కోవిడ్ వ్యాక్సినేషన్ పై హైదరాబాద్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తూ, వ్యాక్సిన్ అందించాలని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వందశాతం వ్యాక్సిన్ జరిగే విధంగా ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలనీ అన్నారు. గ్రామాలలో ప్రణాళికలతో వ్యాక్సిన్ అందించేందుకు టీమ్ లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ పంపిణి విషయంలో ప్రాధాన్యత తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్లకు సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  వైద్యం, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించి కోవిడ్ వ్యాక్సినేషన్ పై అధికారులకు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు గ్రామాలు, గిరిజన గ్రామాలలోని ప్రజలకు అవగహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందించాలని అన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి ఆ ఇంట్లోని సభ్యులు అందరు వ్యాక్సిన్ తీసుకున్నట్లైతే స్టిక్కర్ అంటిచాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీ కార్యదర్శుల అధ్యక్షతన ఆశ, అంగన్వాడీ, ఐకేపీ సభ్యులు, ANM లతో టీమ్ లను ఏర్పాటు చేయాలనీ, పట్టణ ప్రాంతాలలో ANM, మెప్మా, అంగన్వాడీ, ఆశ, మున్సిపల్ సభ్యులతో టీమ్ లను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణంలోని అన్ని వార్డులలో ప్రత్యేక డ్రైవ్ తో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని అన్నారు. వ్యాక్సిన్ వేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేవిధంగా వివిధ శాఖల్లో పని చేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్ లను నియమించుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని వార్డులలో బిల్ కలెక్టర్ లు, జవాన్ లు, సానిటరీ ఇన్స్పెక్టర్ లు పర్యవేక్షణ చేయాలనీ అన్నారు. అదేవిధంగా వార్డ్ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో వ్యాక్సిన్ వంద శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా కేంద్రాలను పరిశీలించి ఎప్పటికప్పుడు డాటా ఎంట్రీ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు వ్యాక్సిన్ కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి వ్యాక్సిన్ వేసిన వివరాలను సమర్పించాలని అన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించే విధంగా చూడాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు సమకూరుస్తూ శిక్షణ అందించాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో సూచించిన విధంగా నివేదికలు సమర్పించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని కేంద్రాలను పర్యవేక్షిస్తూ, వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషి చేయాలనీ అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమీషనర్ శైలజ, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.విజయసారథి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post