వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిన గ్రామాలను కరోనా ఫ్రీ గ్రామంగా ప్రకటిస్తాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిన గ్రామాలను కరోనా ఫ్రీ గ్రామంగా ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున గాదిగూడ మండలం రాంపూర్ గ్రామంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పెద్దలు, సర్ మెడీలు, సర్పంచ్,ఇతర ప్రజాప్రతినిదులు, అధికారుల కృషి ఫలితంగా గిరిజన ప్రాంతాలలో వంద శాతం వ్యాక్సినేషన్ జరుతుందని తెలిపారు. అధికారుల మొటివేషన్ , స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయడం జరుగుతున్నాయని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, వైరస్ బారిన పడకుండా ఉండాలని అన్నారు. దసరా పండగకు ముందు టీకా తీసుకుంటే ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు, చుట్టుపక్కల ఉన్న వారిని, బంధువులను వ్యాక్సిన్ తీసుకునే విధంగా తెలియజేయాలని అన్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకో ని వారు వెంటనే ప్రత్యేక క్యాంప్ లలో తీసుకోవాలని తెలిపారు. గ్రామానికి కావలసిన సమస్యలయినటువంటి రోడ్డు,మిషన్ భగీరత త్రాగునీరు, పాఠశాల, అంగన్ వాడీ భవనం, భూమి సమస్యలు తన పరిధిలోని వాటిని పరిష్కరిస్తానని, తన పరిధిలో లేని సమస్యలపై ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. స్థానిక మెడికల్ ఆఫీసర్ డా.పవన్ కుమార్ సేవలను గ్రామస్తులు కొనియాడడం అభినందనీయమని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శానిటేషన్, హరితహారం, డంపింగ్ యార్డ్, స్మశానవాటికల నిర్మాణం, పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు నమ్మవద్దని, గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని అన్నారు. అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్ మాట్లాడుతూ, గాదిగూడ మండలానికి ప్రత్యేకంగా తనను పంపించినపుడు ఇక్కడి గిరిజనులు వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించారని, స్థానిక సర్ మేడీలు, గ్రామపెద్దలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రోత్సహించామని తెలిపారు. గ్రామంలో మొదట 104 సంవత్సరాల వృద్ధురాలు మార్షిననే నర్మదబాయి తొలుత వ్యాక్సిన్ తీసుకున్నారని, ఆమెను ఆదర్శంగా తీసుకొని గ్రామంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైందని తెలిపారు. రాంపూర్ గ్రామపంచాయితీ పరిధిలో 13,900 మంది అర్హత గలవారు ఉండగా ఇప్పటి వరకు సుమారు 9000 లకు పైగా వ్యాక్సిన్ అందించామని తెలిపారు. రానున్న రెండుమూడు రోజుల్లోగా వందశాతం వ్యాక్సిన్ గ్రామంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఝరి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 85 శాతం, గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 60 శాతం వ్యాక్సినేషన్ జరిగిందని వివరించారు. మండల ఉపాధ్యక్షులు యోగేష్ మాట్లాడుతూ, మండలంలో మోటివేషన్ క్యాంపులు నిర్వహించి, ప్రోత్సహించి వ్యాక్సినేషన్ ఇప్పిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. మండలంలో కలెక్టర్ ప్రతి నెల పర్యటించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తరచుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. సర్పంచ్ ఆత్రం మహేశ్వరి మాట్లాడుతూ, వందశాతం వ్యాక్సినేషన్ కు కృషి చేస్తామని, అంగన్వాడీ, పాఠశాల భవనాలను నిర్మించాలని, మిషన్ భగీరథ త్రాగునీరు రోజు సరఫరా చేయాలనీ కోరారు. మహారాష్ట్రకు కేవలం ఒకే కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం ఉందని, రోడ్డు సౌకర్యం లేక ప్రజలు, ముఖ్యంగా గర్భిణీలు అవస్థలు పడుతున్నారని, త్వరలో బీటీ రోడ్డు పనులు చేపట్టే విధంగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. మెడికల్ ఆఫీసర్ డా.పవన్ కుమార్ మాట్లాడుతూ, 24 హాబిటేషన్ లలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశామని తెలిపారు. ఝరి, గాదిగూడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలోని ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని, గర్భిణీలను స్కానింగ్ కోసం నార్నూర్ పీ.హెచ్.సి కి 102, అవ్వల్ వాహనాలలో పంపిస్తున్నామని తెలిపారు. ప్రతి గురువారం గర్భిణీలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామేశ్వర్, తహసీల్దార్ ఆర్కా మోతిరాం, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post