వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 7: జిల్లా లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, వైద్యాధికారులు, ఎంపీవోలు, మల్టీ పర్పస్ సూపర్వైజర్లతో కలెక్టర్ వ్యాక్సినేషన్, టిబి వ్యాధిగ్రస్తులు గుర్తింపు, ఏఎన్సీ పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సర్వే ద్వారా 3 లక్షల 66 వేల 453 మంది 18 సంవత్సరాల వయస్సు నిండిన వారిని గుర్తించడం జరిగిందని, వీరిలో ఇప్పటి వరకు 3 లక్షల 10 వేల 267 మందికి (84.67 శాతం) వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. మిగులు 56 వేల 186 మంది వ్యాక్సినేషన్ కి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జిల్లాలో జనన, మరణాల సగటు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం సుమారు 4 లక్షల 10 వేల వరకు 18 సంవత్సరాల వయస్సు నిండిన వారుండాలన్నారు. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లాలో 50 మంది మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లు ఉన్నట్లు, వీరు వారి వారి పరిధిలో సర్వేలో ప్రతి ఇల్లు కవర్ చేశారా, ఇంకనూ ఏమైనా ఇండ్లు మిగిలాయా, ప్రతి ఇంటికి వ్యాక్సినేషన్ కు సంబంధించి స్టిక్కర్ అంటించారా, వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి వివరాలు పరిశీలించి, వారిలో ఇంకెక్కడైనా వ్యాక్సిన్ తీసుకున్నది వివరాలు చూసి, తీసుకొని వారికి లక్ష్య సాధన దిశగా వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రోజు వారి వారి చేపట్టిన చర్యలను గ్రూపు లో పోస్ట్ చేయాలన్నారు. జిల్లాలో 1ఏప్రిల్, 2021 నుండి ఇప్పటికి 489 మంది టిబి రోగస్థులను గుర్తించినట్లు ఇంకనూ ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. టిబి వ్యాధిగ్రస్తుల సంబంధికులకు స్క్రీనింగ్ చేయాలని, అలాగే రోగ నిరోధకత తక్కువగా ఉండే ఒక వేయి 578 మంది హెచ్ఐవి రోగులు ఉన్నట్లు, వారిని స్క్రీనింగ్ చేయాలని, ఒకవేళ వారిలో టిబి గుర్తిస్తే, వారి సంబంధికులకు స్క్రీనింగ్ ప్రక్రియ చేయాలని అన్నారు. జిల్లాను టిబి రహిత జిల్లా దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లాలో ఏఎన్సి రిజిస్ట్రేషన్లు 84 రోజులలోపు చేయాల్సివుండగా, చాలా చోట్ల వంద శాతం జరగట్లేదని, ఇందుకు ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. మొదటి, రెండో పరీక్షలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, మూడో, నాలుగో పరీక్షలు ఎంసిహెచ్ లో జరగాలని ఆయన అన్నారు. పరీక్షలు జరిగి, రిజిస్ట్రేషన్ అయితేనే, వారు కేసీఆర్ కిట్ అర్హత పొందుతారని, ఈ నష్టానికి సంబంధిత సిబ్బంది బాధ్యులవుతారని ఆయన అన్నారు. ప్రతి గర్భిణీ దగ్గర మాతా శిశు సంరక్షణ కార్డు ఉండాలని, వీటి ప్రకారం పరీక్షలు, వ్యాక్సిన్ లు, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తారని కలెక్టర్ తెలిపారు. మల్టీపర్పస్ సూపర్వైజర్లు వీటిపై దృష్టి పెట్టాలని, క్షేత్ర పరిశీలనలో అన్ని అంశాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆయన తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, డిపివో కె. రంగాచారి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, జెడ్పి సిఇఓ ఎల్. విజయలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రాము, ఉప జిల్లా వైద్య, ఆరోగ్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post