రాజన్న సిరిసిల్ల, నవంబర్ 15: జిల్లాలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా స్థాయి వక్ఫ్ ఆస్తుల రక్షణ సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 330 వక్ఫ్ సంస్థలు, 693 ఎకరాలు భూములు ఉన్నాయన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ, స్థితిగతులపై నెలవారీ నివేదిక సమర్పించాలన్నారు. జిల్లాలో వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం, అన్యాక్రాంతం పై తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో అన్యాక్రాంతం కాకుండా చేపట్టే చర్యలపై నివేదిక ఇవ్వాలన్నారు. వాణిజ్యపరంగా అనువుగా ఉన్న వక్ఫ్ ఆస్తుల్ని గుర్తించి, వక్ఫ్ బోర్డ్ ఆదాయ వనరులు పెంపొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆక్రమణలపై సమీక్షించి తగుచర్యలు చేపట్టాలని, కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. వక్ఫ్ సంస్థల కంప్యూటరీకరణ జాబితా తయారుచేసి, పివోబీ రిజిస్టర్లో నమోదుచేయాలని, వక్ఫ్ భూములు ప్రయివేటు వారికి రిజిస్టర్ అవకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. వక్ఫ్ సంస్థల వివరాలు రెవిన్యూ రికార్డుల్లో నమోదుచేసి, వక్ఫ్ సంబంధ ఆర్జీలను రెవిన్యూ కోర్టుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. వక్ఫ్ బోర్డ్ నుండి ఎన్ఓసి లేనిదే వక్ఫ్ సంస్థల్లో ప్రయివేటు కట్టడాలకు అనుమతించకూడదన్నారు. వక్ఫ్ భూములు ఆక్రమణ కాకుండా బయో ఫెన్సింగ్ చేయాలని, మొక్కలు నాటాలని ఆయన అన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి. శ్రీనివాసరావు, వేములవాడ ఆర్డీవో లీల, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డు వి. శ్రీనివాస్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఓఎస్డీ ఎండి. సర్వర్ మియా, సిరిసిల్ల మునిసిపల్ కమీషనర్ వి. సమ్మయ్య, సబ్ రిజిస్ట్రార్ బి. ప్రియాంక, సిరిసిల్ల సిఐ పి. ఉపేందర్, వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఎండి. రియాజ్ పాషా, ఎన్జీవో ఎండి. ఇస్మాయిల్, అడ్వకేట్ అన్సార్ అలీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.