వచ్చే పదిహేను రోజుల్లో జిల్లా మొత్తం వంద శాతం కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి – అదనపు కలెక్టర్ మను చౌదరి

వచ్చే పదిహేను రోజుల్లో జిల్లా మొత్తం వంద శాతం కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మను చౌదరి ఎంపిడిఓ లు, మెడికల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రజావాణి హాలు నుండి అందరూ ఎంపిడివోలు, మెడికల్ ఆఫీసర్లతో జూమ్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండి వ్యాక్సినేషన్ కు అర్హులుగా ఉన్న వారు 6.5 లక్షల మంది ఉన్నారని ఇప్పటి వరకు కేవలం 3.7 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందన్నారు. ఇంకా 3 లక్షల వరకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారున్నారని తెలిపారు. వ్యాక్సినేషన్ నత్తనడకన కాకుండా వేగం పెంచాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం రోజుకు 15 వేల వరకు వ్యాక్సిన్ ఇస్తున్నామని దీనిని పెంచి వారం రోజుల్లో లక్ష మందికి టీకా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని, ఇంటింటికి వెళ్లి వారిని తొలుకోచ్చి వ్యాక్సిన్ ఇప్పించి తిరిగి ఇంటివద్ద దింపి వచ్చే విధంగా చర్యకు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు ఎన్ని గ్రామాలు వందశాతం వ్యాక్సినేషన్ అయ్యిందో గూగుల్ స్ప్రెడ్ షీట్ లో రిపోర్ట్ సాయంత్రం లోగా పంపించాలని ఎంపిడివోలను ఆదేశించారు. వందశాతం పూర్తి అయిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ నుండి ధ్రువీకరణ నివేదిక తీడుకోవాలని సూచించారు. జిల్లాలో వ్యాక్సిన్ వాయిల్స్ కు కొరత లేదని జనాలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ చేయించాల్సిన బాధ్యత ఎంపిడివో లు, మెడికల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రెటరీలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జూమ్ మీటింగ్ లో జిల్లా వైద్య అధికారి డా. సుధాకర్ లాల్, అందరూ ఎంపిడివోలు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post