వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక ప్రకటన        తేది:08.08.2022, వనపర్తి.

జాతీయ భావం పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు.
సోమవారం ఐ డి ఓ సి. సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై సంబంధిత జిల్లా అధికారులతో ఆమె సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 75 వసంతాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతంలో స్వాతంత్ర్య పోరాట ఫలితాలను మనమందరం అనుభవిస్తున్నామని, ఆ స్ఫూర్తిని, ప్రేరణను, జాతీయ భావాన్ని ఇప్పుడున్న తరాలకు కలిగించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వజ్రోత్సవ వేడుకలను ఆగస్ట్ 8 నుండి 22వ. తేది వరకు ప్రతిరోజు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలని ఆమె సూచించారు. త్రివర్ణ పతాకాలను మండలాలకు, మునిసిపాలిటీలకు ఈ నెల 9వ. తేది నుండి జెండాలను పంపిణీ చేయుటకు గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీ, మునిసిపాలిటీలలో వార్డ్ సభ్యులు, అధికారులచే పంపిణీ జరగాలని, జెండాలను పంపిణీ చేయుటకు అన్ని నియమ, నిబంధనలు పాటించాలని, టీమ్ లను ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి జెండాలను అందజేయాలని, జెండాలు ఇచ్చినప్పుడు ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు తెలుపాలని,  అన్ని నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. నిబంధనల విషయంలో, ఎగురవేసే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ టామ్ టామ్ చేయించాలని, జెండాలు ఎగురవేసిన సందర్భంలో ఫోటోలు, వీడియోలు తీసి ఆయా శాఖలకు పంపాలని ఆమె తెలిపారు.
ప్రతి ఇంటిపైన జెండాను ఎగురవేసిన సందర్భంలో ఇతర జెండాల కంటే ఎత్తులో ఉండాలని, ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే విధంగా కర్రను, పి.వి.సి. పైప్ కు జెండాను పెట్టాలని, 13వ తేది నుండి 15వ. తేది వరకు జెండాలను ప్రతి ఇంటిపై ఎగురవేసే విధంగా చూడాలని ఆమె సూచించారు. ఈ నెల 9వ. తేది నుండి గాంధీ సినిమా ప్రదర్శన ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం గం.1-15 ని.ల వరకు నిర్వహించనున్నట్లు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు ఉదయం వచ్చే విధంగా చూడాలని, బస్ లో ప్రతి 15 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలని, ఒక మండల స్థాయి అధికారి బస్ లో వుండాలని, ఉదయం 9 గంటలకు పాఠశాలలో పిల్లలను వాహనంలో ఎక్కించుకొనే విధంగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆమె తెలిపారు. సేఫ్టీ రూట్ లో వెళ్ళాలని, 9వ. తేది నుండి 11వ తేది వరకు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు,  ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు గాంధీ సినిమా ప్రదర్శన ఉంటుందని ఆమె వివరించారు.
రోజువారీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ.తేది నుండి 21వ తేది వరకు చేయవలసిన కార్యక్రమాలు, పోలీస్ శాఖ, ఇతర శాఖ అధికారుల సమన్వయంతో ఈ నెల 11న ఫ్రీడమ్ రన్, 13న ర్యాలీ, 16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధికారులు, తహశీల్దార్, ఎంపిడిఓ లు, ఎస్.హెచ్. ఓ.లతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె సూచించారు. స్పోర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసుకొని క్రీడా పోటీలు నిర్వహించాలని, ఉద్యోగులు, యూత్ కొరకు పోటీలు నిర్వహించ నున్నట్లు, 18న బహుమతుల ప్రధానం చేయనున్నట్లు ఆమె తెలిపారు. యూత్ కొరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో, ఉద్యోగులకు మండల, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు ఆమె సూచించారు.
స్వాతంత్ర్యం సిద్ధించి 75 సం.లు పూర్తి అయిన సందర్భంగా “భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల” ను తేది:09.08.2022 న మధ్యాహ్నం గం. 03.00 ని.లకు ప్రారంభిస్తున్నట్లు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వజ్రోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆమె వివరించారు. ఈ వేడుకలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post