చేగుంట మండలం వడియారం అర్బన్ పార్కులో నాటిన వివిధ మొక్కలను అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ. శాంతకుమారి బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్.ఏం.డి.ఏ. ఆధ్వర్యంలో వడియారం, పోలంపల్లి, చందంపేట ఫారెస్ట్ బ్లాక్ లోని 528 . 82 హెక్టార్లలో 2019 లో చేపట్టిన ఈ అర్బన్ పార్కులో ఇప్పటి వరకు 2,32,300 మర్రి, వేప, జువ్వి, నెమలినార, కానుగ, టేకు, వెదురు, మారేడు, అల్లనేరేడు, రోజ్ వుడ్, తాని వంటి మొక్కలు నాటడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సెప్టెంబర్ నాటికి 4,42,800 మొక్కలు నాటనున్నామని అన్నారు. వడియారంతో పాటు జిల్లాలోని పరికిబండ, మనోహరాబాద్ లలో కూడా అర్బన్ పార్కుల నిర్మాణం చేపట్టామని, పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ఈ అర్బన్ పార్కుల నిర్మాణాల వళ్ళ పర్యావరణాన్ని కాపాడడంతో పాటు వాతావరణ సమతుల్యత , ప్రజలు ఆహ్లాద వాతావరణంలో ఉల్లాసంగా సేదతీరుటకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతాలకు చుట్టుప్రక్కల ఉన్న ఫారెస్ట్ బ్లాక్స్ అన్నింటిని కూడా హరిత వనాలుగా తీర్చిదిద్దాలనే బృహత్ సంకల్పంతో ముందుకు పోతున్నామని అన్నారు. అందులో భాగంగా 2021 లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఒక లక్ష 60 వేల ఎకరాలలో ఉన్న హరిత వనాలలో ఈ సెప్టెంబర్ నాటికి సుమారు రెండు కోట్ల వివిధ రకాల మొక్కలు నాటుటకు కార్యాచరణతో ముందుకు పోతున్నామని పనులు కూడా ముమ్మరంగా జరుగుచున్నాయని అన్నారు. అనంతరం అటవీ ప్రాంతాన్ని కాలి నడకన పరిశీలించి చెట్ల పెంపుదలకు తీసుకుంటున్న చర్యలు అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్న చెక్ డ్యామ్ ను పరిశీలించారు. అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్, హెమ్.ఏం.డి.ఏ డైరెక్టర్ ప్రభాకర్, మెదక్, సిద్ధిపేట డి.ఎఫ్.ఓ.లు రవి ప్రసాద్, శ్రీధర్ రావు, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్ లతో కలిసి అర్బన్ పార్కు ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వడియారం అర్బన్ పార్కును పరిశీలించిన – అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ. శాంతకుమారి
