పత్రికా ప్రకటన. తేది:9.11.2021. వనపర్తి.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
మంగళవారం వనపర్తి మున్సిపాలిటీలోని వివిధ వార్డులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 4వ. వార్డులోని మినీ ట్యాంక్ బాండ్, 16, 17, 18వ. వార్డులలోని కందకం మార్కెట్ ను, 29వ. వార్డులోని పార్క్ ను ఆయన సందర్శించి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ఎప్పటికప్పుడు చెత్త సేకరణ, పారిశుద్ధ్యం పనులలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్వహించాలని, తద్వారా పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహద పడుతుందని ఆయన సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్త వేరు చేయటంలో మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని, వారి వారి పరిధిలోని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. ఆయా వార్డులలో ఏవైనా సమస్యలు ఉంటే సత్వరమే అధికారులు స్పందించి వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.