ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తలెత్తిన వరద పరిస్థితుల సమయంలో అధికార యంత్రాంగం పనితీరు అభినందనీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్ది అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నస్పూర్ సింగరేణి అతిథిగృహంలో వరద పరిస్థితులపై ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోళీకేం, జిల్లా అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, మధుసూదన్ నాయక్, శాసనమండలి సభ్యులు పురాణం సతీష్, టైని కలెక్టర్ ప్రతిభా సింగ్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అహర్నిశలు పనిచేశారని, ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వరద పరిస్థితుల వల్ల ఏర్పడిన నష్టంపై పూర్తి సర్వే నిర్వహించి ప్రణాళిక తయారు చేసి నివేదిక అందించాలని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేద్దామని అన్నారు. జిల్లాకు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుకోవడం జరిగిందని, 40 సెంటీమీటర్ల వర్షం పడటంతో భారీ నష్టం ఏర్పడిందని, ఈ మేరకు సంబంధిత అన్ని శాఖల నుండి నివేదికను రూపొందించి, ఆ ప్రకారంగా నష్టపోయిన వారికి వెంటనే సహాయం అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కోటపల్లి, వేమనపల్లి, భీమిని మండలాలలో కొన్ని వంతెనలు, రహదారులు చెడిపోయిన వాటిని త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖల అధికారులు పనులు పూర్తి చేయాలని, చెరువులు, డ్యాములు, కుంటలు, కాలువలు ఇతర వాటికి త్వరగా మరమ్మతు పనులు చేపట్టాలని, జిల్లాలో ఎక్కడా కూడా విద్యుత్ అంతరాయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించాలని, మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా పైపులైన్ల లీకేజీల పనులు వెంటవెంటనే చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ మన ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని, చెన్నూరు నియోజకవర్గం ప్రాణహిత, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండడంతో నష్టం ఎక్కువగా జరిగిందని, ఇటువంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నించడం జరుగుతుందని, వర్షాకాలం పూర్తి అయ్యేలోపే సంబంధిత శాఖల అనుమతులు పొంది అన్ని పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7 వేల ఎకరాలలో వివిధ రకాల పంటల నష్టం జరిగిందని, మంచిర్యాల పట్టణంలో 77 కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరిందని తెలిపారు. ప్రజల సహాయార్థం జిల్లాలో ఏడు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని నియమించడం ద్వారా వరద పరిస్థితులు, ప్రజల సంక్షేమం దిశగా నివేదికలు తయారు చేయడం జరిగిందని తెలిపారు. బ్యాక్ వాటర్ కారణంగా చెన్నూర్, జైపూర్, భీమారం మండలాలలో జరిగే నష్టంపై శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామల దేవి,డి. సి. ఎం. ఎస్. చైర్మన్ తిప్పని లింగయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గురువయ్య, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.