వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై మండల వ్యవసాయాధికారులతో సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.
తేది:30.11.2021, వనపర్తి.

యాసంగిలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో మండల వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే యాసంగిలో వరి పంటకు బదులు ఆరుతడి పంటలైన వేరుశనగ, మినుము, పెసర ,ఆముదం, కుసుమలు, కూరగాయలు, పండ్ల తోటలు, పామ్ ఆయిల్, సాగుచేసి అధిక దిగుబడి పొందవచ్చని ఆమె వివరించారు.
జిల్లాలో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 71 క్లస్టర్ల పరిధిలో 250 దుకాణాలలో విత్తనాలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. వరి ధాన్యం విక్రయించడానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా, ఇతర పంటల సాగు చేసేలా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు రైతులకు ఆరుతడి పంటలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని, వరి పంట సాగు చేస్తే ఎఫ్ సి ఐ కొనుగోలు చేయదన్న అంశాన్ని రైతులకు వివరించాలని ఆమె తెలిపారు. ఏ భూమికి, ఏ పంటలు వేయాలి అనే విషయాన్ని శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అనంతరం యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగు పోస్టర్ ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏ డి ఏ శివనాగిరెడ్డి, మండల వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post