వరి కొనుగోలు విషయంలో ఇంతకు ముందు వచ్చిన ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

వరి కొనుగోలు విషయంలో ఇంతకు ముందు వచ్చిన ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లొ వరి కొనుగోలు సందర్బంగా ఏర్పడుతున్న ఇబ్బందులు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైస్ మిల్లర్ల సంఘాలు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు జిల్లాలో వరి ధాన్యం సాగు అంతగా ఉండేది కాదని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సాగునీటి సదుపాయాల వల్ల గత రెండు మూడు సంవత్సరాల నుండి ఒక్క సారిగా వరి ధాన్యం సాగు పెరిగి విపరీతంగా ధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు. దీనివల్ల సరియైన రైస్ మిల్లులు, గోదాములు లేకపోవడం వంటి కారణాలు, అదే విధంగా కరోనా రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కొన్ని చోట్ల అవకతవకలు సైతం జరిగినట్లు తమ దృష్టికి రావడం జరిగిందని అలాంటి తప్పిదాలు పునరావృతం అయితే సంబంధిత కొనుగోలు కేంద్రమ్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఉండాల్సిన అన్ని కనీస సౌకర్యాలు ఉండేవిధంగా చూసుకోవాలని ఆదేశించారు. క్రితం సారి విపరీతంగా ధాన్యం వచ్చిన కొన్ని ఇబ్బందులతో బయటపడి రైతులందరికీ సకాలంలో డబ్బులు చెల్లించగలిగామని అది ప్రతి ఒక్కరి సహకారం వల్ల మాత్రమే సాధ్యమైందన్నారు. ఈ సారి సైతం ప్రజాప్రతినిధులు, సహకార సంఘాలు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు ద్విగుణీకృత సహకారం అందించాలని కోరారు. ఈ సారి వరి కి మద్దతు ధర గ్రేడ్-ఏ రకం అయితే క్వింటాలుకు రూ. 1960 సాధారణ రకం అయితే రూ. 1940 చెల్లించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గత పంటలో సేకరించిన ధాన్యం ఇంకా పూర్తిగా మిల్లింగ్ జరుగలేనందున మరియు మిల్లుల కొరత వల్ల ఈ సారి సగం ధాన్యం ఇతర జిల్లాలకు పంపించడం జరుగుతుందని ఇందుకు అనుగుణంగా సిద్ధం కావాల్సిందిగా సూచించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ రైతులు ఒకే రకమైన పంటను కాకుండా వివిధ రకాలైన పంటలను సాగు చేసి ఎక్కువ లబ్దిపొందాలని కోరారు. ఇదే విషయాల పై రైతులకు అర్ధమయ్యే విధంగా రైతు వేదికల్లో సమావేశం నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టాలని ప్రజాప్రతినిధులను కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పై ప్రత్యెక దృష్టి పెట్టి రైతులను ధనవంతులను చేయాలనే ఉద్దేశ్యంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూమి శాతం విపరీతంగా పెరిగిందన్నారు. దీనికి తోడు విత్తనాలు, ఎరువులు, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలతో పాటు రేటు బంధు అమలు చేయడం వల్ల జిల్లా నుండి వలస వెళ్లిన వారు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఎక్కువ తాలు, పొట్టు లేకుండా తేమ సైతం నిబంధనలకు అనుగుణంగా ఉండేటట్లు ఆరబెట్టి తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలియజేసారు.
ఈ అవగాహన కార్యక్రంలో పాల్గొన్న సహకార సంఘాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు, తరలింపులో తమకు ఎదురైన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని తిరిగి పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ను కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ ఏ.డి రమేష్, పి.డి.డిఆర్డీఏ నర్సింగ్ రావు, ఆర్.డి.ఓలు, జడ్పిటిసిలు, ఎంపిపి లు, సహకార సంఘాల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post