వరి ప్రత్యామ్నాయ పంటలపై సంబంధిత అధికారులతో సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన, తేది: 25-10-2021, వనపర్తి.

ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని, సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను పండించడంపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రొఫెసర్ జయశంకేర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం మదనాపురం శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి సూచనల మేరకు మండల వ్యవసాయ అధికారులు, పంటల సాగుపై ప్రణాళికలను తయారు చేసి, రైతులు యాసంగి సీజన్ లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా మినుములు, శనగ, వేరుశనగ, ఆముదం, నువ్వులు, పెసర, పొద్దుతిరుగుడు తదితర పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించి, ప్రత్యమ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలియజేయాలని ఆమె సూచించారు. గ్రామాలలో మొత్తం ఎంత మంది రైతులు ఉన్నారు, ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు, ఏ ఏ పంటను పండించారు, ప్రస్తుతం ఏ పంటలు పండిస్తున్నారని వివరాలతో కూడిన జాబితాను తయారు చేయాలని ఆమె వివరించారు.

భారత ఆహార సంస్థ (FCI) సేకరించడం లేదని, రైతులు వరి సాగును తగ్గించి ఇతర పంటల పై దృష్టి సారించాలని ఆమె అన్నారు. ఆయిల్ ఫామ్, జావర్, పెసర, మినుము, మామిడి, మల్బరీ పంటలను సాగు చేయాలని ఆమె సూచించారు. గ్రామాలలో రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి అధనపు కలెక్టర్ , ఆర్.డి.ఓ., వ్యవసాయ, ఉద్యానవన శాఖల మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, అందరు రైతు వేదికల సమావేశాలలో పాల్గొని, ఏ పంటలు పండిస్తే మంచిదని రైతులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. రేపటి నుండి ప్రారంభించి అక్టోబర్ 29 వరకు 4 రోజులలో అన్ని గ్రామాలలో రైతు వేదిక సమావేశాలు పూర్తి చేయాలనీ, గ్రామంలో ఉన్న రైతులందరు రైతు వేదిక సమావేశాలలో పాల్గొనేలా చూడాలని అధికారులకు ఆమె ఆదేశించారు. మండలాల్లో మొత్తం రైతు వేదికలు, క్లస్టర్స్ ఎన్ని ఉన్నాయి, శాస్త్రవేత్తలు ఎంత మంది ఉన్నారు అనేది ఎ.ఇ.ఓ లు గ్రామాల వారిగా లిస్టు తయారు చేసి, రైతు వేదిక సమావేశాలను పూర్తి చేయాలనీ ఆమె అన్నారు.
మినుములు అక్టోబర్ 31, డిసెంబర్ 15, ఫిబ్రవరి 15 వరకు, వేరుశెనగ నెంబర్ 15 వరకు, ఆముదము నవంబర్ 30 వరకు, నువ్వులు జనవరి, ఫిబ్రవరి వరకు, పెసలు అక్టోబర్ 31, డిసెంబర్ 15, ఫిబ్రవరి 15 వరకు, శనగలు నవంబర్ 30 వరకు, పొద్దుతిరుగుడు డిసెంబర్ వరకు సాగు చేయుటకు అనుకూలమని ఆమె తెలిపారు.
ఎ.ఇ.ఓ లు రైతులకు అందుబాటులో ఉండి సాగులో వారికి తగిన సలహాలు, సూచనలు చేయాలనీ, విత్తనాల నాణ్యతపై, పంటలకు మార్కెట్లో ఉండే ధరలు, వచ్చే లాభాల గురించి పూర్తి వివరాలు స్పష్టంగా రైతులకు చెప్పాలని, శాస్త్రవేత్తలతో సాగు పద్ధతులను వివరించాలని ఆమె తెలిపారు. అదేవిధంగా కూరగాయలు పండించేలా ప్రోత్సహించాలని, ఉద్యానవన అధికారులను ఆమె కోరారు. వరికి ప్రత్యామ్నాయంగా 12 రకాల విత్తనాలను ఇతర రాష్ట్రాల నుండి సేకరించి అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులకు ఆమె తెలిపారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి సురేష్, శాస్త్ర వేత్త శాకైర్ అలి, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

 

Share This Post