వర్షాకాలంలో పడిన ప్రతి వర్షపు నీటిని వృధా పోనియకుండా భూమిలో ఇంకె విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

వర్షాకాలంలో పడిన ప్రతి వర్షపు నీటిని వృధా పోనియకుండా భూమిలో ఇంకె విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. జలశక్తి అభియాన్ కింద జిల్లా భూగర్భ జల వనరుల శాఖా ఆధ్వర్యంలో శనివారం ఉరుకొండ మండలంలోని రైతు వేదికలో వాన నీటి సంరక్షణ – భూగర్భ జలాల పెంపుదలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం, మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ప్రతి సంవత్సరం పడే వర్షాల కంటే ఎక్కువ నీటిని వాడుకోవడం జరుగుతుందన్నారు. దీనివల్ల రానురాను భూగర్భజలాలు అడుగంటి రాబోయే తరానికి నీరు లేకుండా పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అటువంటి విపత్కర పరిస్థితి రాకుండా నివారించాలంటే పడిన ప్రతి వర్షపు నీటిని భూమిలో ఇంకె విధంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. దీనికొఱకు ప్రతి ఇంటి పై పడిన వర్షపు నీరును భూమిలో ఇంకె విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మురుగు నీరు కాలువ చివరన ఖాళీగా వదలకుండా పెద్ద కమ్యూనిటీ ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి అవసరం అధికంగా లేని ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గుచూపాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతి పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకొవాలని, పాటు కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడం, ముళ్ళపొదలు తొలగించి నీరు వృధా కాకుండా చివరి ఆయుకట్టు వరకు వెళ్ళేవిధంగా చూడాలన్నారు.చేలాల్లో మోటార్లు స్టార్ట్ చేసి మరిచిపోయే పనులు చేయవద్దని రైతులను కోరారు. అవసరమైన మోతాదులోనే నీటిని వాడుకోవాలని సూచించారు. చెరువుల్లో నీరు తగ్గినప్పుడు పూడికతీత పనులు చేపట్టాలన్నారు. ప్రతి రైతుకు ప్రతి వ్యక్తికి నీటి సంరక్షణ పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు జల సంరక్షణ పై భూగర్భజలాల శాఖ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, జిల్లాలో భూగర్భ నీటి మట్టాలు తెలిపే ఛాయా చిత్ర ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా భూగర్భ జలాల అధికారిణి రమాదేవి, పిడి డిఆర్డీఓ నర్సింగ్ రావు, సి.పి.ఓ భూపాల్ రెడ్డి, డి.పి.ఓ కృష్ణ, ఎంపీపీ రాధ, సర్పంచు రాజయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ఏ.ఓ, ఏ.ఈ.ఓ లు పాల్గొన్నారు.

Share This Post