వలసలకు స్వస్తి పలికి రైతే రాజు అనే వాదాన్ని నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనులకు గిరివికాస్ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు సాగు నీరు అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు అన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి అచ్ఛంపేట మండలంలోని దుబ్బతాండ గ్రామపంచాయతిలో లంబాడీ రైతులకు గిరివికసం కింద మంజూరు అయిన బోర్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియా, గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా నివసించే అచ్ఛంపేట ఏరియాలో గిరిజన రైతులకు భూమి వుండి సాగుకు బోరు అవసరమైన పేద రైతులకు గిరి వికాసం పథకం కింద బోరు బావి వేయించి, మోటారు, విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ముగ్గురు నలుగురు రైతులు కలిసి ఒక క్లస్టర్ గా ఏర్పడి బోరుబావి కావాలనుకుంటే భూగర్భ జల వనరుల శాఖ వారు బోరు పాయింట్ చూసి ప్రతిపాదనలు ఆమోదం తెలుపుతోందన్నారు. గిరివికసం పథకం కింద ఇప్పుడు అచ్ఛంపేట నియోజకవర్గానికి 13 క్లస్టర్లకు బోర్లు మంజూరు కాగా దుబ్బ తాండ గ్రామపంచాయతిలో 5 క్లస్టలకు బోరుబావులు మంజూరు అయినట్లు తెలిపారు. ప్రతి గిరిజన రైతు బిడ్డ ఈ గిరివికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గిరివికసం పథకంలో ఎలాంటి పరిమితులు లేవని, గిరిజనులై వుండి ఇద్దరు ముగ్గురు కలిసి ఒక క్లస్టర్ గా ఏర్పడి భూమి సాగు కొరకు బోరు కావాలనుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. వందశాతం సబ్సిడీ పై ఇచ్చే ఈ బోరుబావి కి మోటారు, విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. డి.ఆర్.డి.ఏ, మండల అభివృద్ధి అధికారి ద్వారా నిర్వహించే ఈ గిరివికాస్ పథకాన్ని గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అంతకుముందు శాసన సభ్యులు, గ్రామ పంచాయతీ పెద్దలతో కలసి దుబ్బతాండ లోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకున్నారు. అనంతరం గిరివికాస్ ద్వారా మంజూరు అయిన బోరును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు నాయక్, అచ్చంపేట తహసిల్దార్, జడ్పిటిసి మంత్ర్యానాయక్, సర్పంచ్ కిషన్, పదర జడ్పిటిసి రాంబాబు, తే.రా.స. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు లబ్ధిదారులు పాల్గొన్నారు.