వసతి గృహాలలో మెన్యూను ఖచ్చితంగా పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 06, ఖమ్మం:

వసతి గృహాలలో మెన్యూను ఖచ్చితంగా పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పోస్టు మెట్రిక్ గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తణిఖీ చేసారు. వంటగది, బోజనశాల, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థుల వసతి గదులను కలెక్టర్ తణిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ వసతి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సకాలంలో ఇస్తున్నారా మెన్యూ ప్రకారం ప్రతిరోజు ఆకుకూరలు, గ్రుడ్లు వారంలో రెండు రోజుల పాటు మాంసాహారం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెన్యూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు విద్యార్థులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహం వార్డెన్, వంట మనుషులకు పలు ఆదేశాలు చేసారు. వంటలకు గ్యాస్ సిలెండర్లను వినియోగించాలని, కట్టెల వాడకాన్ని పూర్తిగా నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు కళాశాల సమయానికంటే ముందే అల్పాహారం, మధ్యాహ్నభోజనం సిద్ధం చేసి అందించాలన్నారు. వారంలో రెండురోజులు తప్పనిసరిగా మాంసాహారంతో భోజనాన్ని అందించాలని ప్రతిరోజు గ్రుడ్డు తప్పనిసరిగా ఇవ్వాలని, పాలు, సాయంకాల సమయంలో రుచికరమైన స్నాక్స్ అందించాలని వార్డె న్ ను కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులను సకాలంలో సమకూర్చాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థులకు అవసరమైన క్రీడా సదుపాయాన్ని కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వసతి గృహం పక్కనే నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న గిరిజన సంక్షేమ భవనాన్ని కలెక్టర్ తణిఖీ చేసారు. ముగింపు పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని లేనియెడల బాధ్యులపై చర్యలుంటాయని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి కృష్ణనాయక్, ఏ.టి.డి.ఓ తిరుమలరావు, వార్డెన్ యూ భారతీ, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు రాజు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share This Post