ప్రచురణార్ధం.
డిశంబరు, 02, ఖమ్మం:–
వానాకాలం సీజన్ వరి ధాన్యాన్ని చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. గురువారం కల్లూరు మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కల్లూరు మండలంలోని ముచ్చ వరం, పుల్లయ్య బంజర ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి రైతులతో మాట్లాడుతూ వానాకాలం సంబంధించిన వరి ధాన్యాన్ని రైతులు తూర్పారబట్టి కొనుగోలు కేంద్రాలకు తెచ్చేవిధంగా సహకరించాలని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అట్టి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కాటా చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రం బాద్యులను, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల సమీప ప్రాంతాలలోని మిల్లులను కేటాయించడం వల్ల రైతులకు రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని ట్రాక్టర్ల ద్వారా సులభంగా మిల్లులకు ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేసామని కలెక్టర్ తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం సంబంధించిన డేటాను వెంటనే ఎంట్రీ. చేసి 24 గంటల లోపు రైతులకు చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్రస్తుతం ఇండెంట్ చేసిన గన్నీబ్యాగులకు అదనంగా కావలసిన గన్నీబ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని గన్నీబ్యాగుల వల్ల రవాణా సమస్య ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పుల్లయ్య బంజర కొనుగోలు కేంద్రం సందర్శణ సందర్భంగా గ్రామంలో నిర్మించిన నూతవ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. అదేవిధంగా గ్రామంలోని నర్సరీలో జరుగుచున్న బ్యాగు ఫిల్లింగ్ పనులను కలెక్టర్ తనిఖీ చేసారు. అనంతరం గ్రామంలోని వెంకటేశ్వర రైస్మెల్లును జిల్లా కలెక్టర్ సందర్శించి మిల్డింగ్ లోడింగ్, అన్లోడింగ్ , ధాన్యం నిల్వల పట్ల రైస్ మిల్లు యజమానితో మాట్లాడి మిల్లింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలను పురస్కరించుకొని కల్లూరు డివిజన్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు గాను కల్లూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు . పోలింగ్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ, ఓటర్లకు కనీస వసతుల ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ పలు ఆదేశాలు చేసారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా, సహకార శాఖాధికారి విజయకుమారి, సివిల్ సప్లయిన్ జిల్లా మేనేజర్ సోములు, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, తహశీల్దారు మంగిలాల్, ఎం.పి.డి.ఓ వివిధ సొసైటీల చైర్మన్లు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.