వారంలోగా వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 8: వారంలోగా వ్యాక్సినేషన్ లక్ష్యం వంద శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఎంపీవోలతో వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధుల నియంత్రణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని సబ్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలన్నారు. లక్ష్యం పై దృష్టి పెట్టి, ఇంకనూ వ్యాక్సిన్ తీసుకొనని వారిని సమీకరించి వ్యాక్సిన్ కేంద్రానికి రప్పించాలన్నారు. నిర్ణీత సమయం మేరకు రెండో డోసు వారికి వ్యాక్సిన్ ఇస్తూనే, ఇంకనూ మొదటి డోస్ తీసుకొనని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. వైద్యాధికారులు ఏఎన్ఎంలతో ప్రతిరోజు సమీక్ష చేయాలన్నారు. పంచాయితీ కార్యదర్శులు వారి వారి గ్రామాల్లో వ్యాక్సిన్ తీసుకొనని వారిని చైతన్య పరచాలన్నారు. అటవీ హక్కుల అర్జీలు తీసుకొనే ప్రదేశం, ధాన్య కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేక వ్యాక్సిన్ శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. వైద్యాధికారులు లక్ష్యం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని, శాఖల సమన్వయంతో లక్ష్యం పూర్తి చేయాలని అన్నారు. డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చిన ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి, వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పాజిటివ్ వచ్చిన ఇంటి పరిసరాల్లో డివాటరింగ్ చేయాలని, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంటింటా జ్వర సర్వే చేయాలన్నారు. ఇమ్యునైజేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓపిలు నిర్వహించాలని, అవసరమైన వారికి పరీక్షలు జరపాలని ఆయన అన్నారు. ఆరోగ్య కేంద్రం లోపల, పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని ఆయన తెలిపారు.
ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్, జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, జెడ్పి సిఇఓ గౌతం రెడ్డి, డిపివో రవీందర్, ప్రోగ్రామ్ అధికారులు, మండల వైద్యాధికారులు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post