వారం రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

వారం రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

*వారం రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన*
*అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల*
జనగామ, ఆగస్టు 30: రాబోయే వారం రోజులు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. సోమవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, తహశీల్దార్లకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో 12 జిల్లాల్లో వారం రోజులు భారీ నుండి అతిభారీ వర్ష సూచన ఉందని, అందులో జనగామ జిల్లా కూడా ఉందని, ఫ్లడ్ ప్రోటోకాల్ అమలు చేస్తూ, విధిగా విధుల్లో ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది ఎవరికి ఎలాంటి సెలవులు లేవని, ఇదివరకే సెలవులో ఉంటే, వెంటనే విధుల్లో చేరి, క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. గ్రామాల్లో టాం టాం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని, వాగులను దాటడం, చెరువుల దగ్గరకు వెళ్లడం, ఈత కొట్టడం, చేపలను పట్టడం ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గుర్తించిన పునరావాస కేంద్రాలను శుభ్రపరచడం, ప్రజా ప్రతినిధుల సహకారంతో సిబ్బంది విధుల కేటాయింపు చేయాలన్నారు. ప్రజలకు సహాయార్థం జిల్లా కేంద్రంలో *8247847692* నెంబర్ తో కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్లు, సమాచారం, సహాయానికి ప్రజలు కాల్ చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 965 చెరువులు, కుంటలు ఉండగా, 224 పూర్తిగా నిండటానికి చేరువలో ఉన్నట్లు, చిటకోడూర్ చెరువు పూర్తిగా నిండి మత్తడి పోస్తున్నట్లు ఆమె అన్నారు. పూర్తిగా నిండి, చెరువు కట్టలు తెగకుండా నిరంతరం పరిశీలన చేయాలని, నష్టం వాటిల్లకుండా మనుషులు, మెషినరీ, ఇసుక బస్తాలు ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. రోడ్లపై నీరు ప్రవహిస్తుంటే, పాదచారులు, వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని, ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాలని ఆమె అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని వారిని ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆమె తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా జరిగితే సంబంధిత అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post