వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 27:
రానున్న వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని చాంబర్ లో కలెక్టర్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 257 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల 73 వేల 489 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ధాన్యం విక్రయించిన రైతులందరికీ సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చూడాలన్నారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయదనే విషయం రైతులందరికీ తెలిసేలా చూడాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేలా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమీక్షలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీఏఓ రణధీర్ కుమార్, డీసీఓ బుద్ధనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Share This Post