విద్యార్థులకు ఉపయోగపడేలా గ్రంథాలయాలను అభివృద్ధి – జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పటి పాండు రంగారెడ్డి

విద్యార్థులకు ఉపయోగపడేలా గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పటి పాండు రంగారెడ్డి అన్నారు.

గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయం సరూర్నగర్ లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకొనుటకు సంచాలకుల వారికి అనుమతి కొరకు ఈ సమావేశంలో తీర్మానం చేయబడిందన్నారు. జిల్లాలోని విద్యార్థులకు గ్రంథాలయ సేవలు నేరుగా అందించాలనే ఉద్దేశ్యంతో జిల్లాలోని ఉన్నత పాఠశాల ఆవరణలో కంటైనర్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ప్రస్తుతం 50 కంటైనర్ గ్రంథాలయాలు ఏర్పాటుకు తీర్మానిస్తూ ప్రముఖ ఉన్నత పాఠశాలలు ఎంపిక చేశామన్నారు.
షాబాద్ శాఖ గ్రంథాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరినందున 75 లక్షల నిధులతో నూతన భవనం నిర్మాణం చేయుటకు తీర్మానం చేయడం జరిగిందన్నారు. అనంతరం ఈ ఆర్ధిక సంవత్సరం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల నుండి సుమారుగా మొత్తం 2 కోట్ల రూపాయల గ్రంథాలయ సెస్సు సంస్థకు జమ అయ్యేట్లు కృషి చేసి సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డిని సంస్థ తరపున సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఏనుగు ఆనంద్ రెడ్డి , డీ.పీ.ఓ శ్రీనివాస్ రెడ్డి, డీ.ఈ. ఓ సుశీంద్ర రావు , డీ.డీ. అడల్ట్ ఎడ్యుకేషన్ గణేష్ , కార్యదర్శి యం. మనోజ్ కుమార్ , జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది బి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post