జిల్లాలోని పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బి. ఈ.డి. కళాశాలలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి మణెమ్మతో కలిసి సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఉన్నత పాఠశాలలు, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని, అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకొని పిల్లలకు విద్య బోధించాలని, ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలు పాటిస్తూ నడపాలని సూచించారు. విద్యాశాఖలోని బోధన, బోధనేతర సిబ్బంది నూరు శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని, 9,10 తరగతుల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్య అభివృద్ధి తదితర కార్యక్రమాలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పాఠశాలలల ప్రధానోపాధ్యాయులు, తమ విద్యార్థులకు అందించే దిశగా కృషి చేయాలని తెలిపారు. వచ్చే నెలలో జరుగబోయే సంగ్రహణాత్మక మూల్యాంకనం సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులను ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, పాఠశాలలో ఏ, బి, సి కార్యక్రమం నిర్వహించాలని, తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతి ఒక్క విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రాథమిక స్థాయి నైపుణ్యాలు బోధించడం జరుగుతుందని, విద్యార్థులందరికీ పౌష్టికాహారం, మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, విద్యార్థులు ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహమూద్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.