విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్


ఇ-న్నోవేట్ 2021 పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థినిలను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి , నవంబర్ 09:- ఇన్నోవేట్-2021 అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శనలో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థినిలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అభినందించారు. పోలాండ్ దేశం నిర్వహించిన అంతర్జాతీయ సైన్స్ ఇ-న్నోవేట్ పోటీలలో పాల్గొన్న విద్యార్థినిలు కలెక్టర్ ను మంగళవారం తన చాంబర్లో కలిసారు. జిల్లాలోని రామగిరి మండలంలోని చందనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు తమ సృజనాత్మకమైన సత్తా చాటి పాల్గొన్న నాలుగు విభాగాల్లో బంగారు పతకాలు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేసారు. గత సెప్టెంబర్ మాసం 20,21 తేదీల్లో ఆన్ లైన్ వేదికగా పోలాండ్ దేశం నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాణించడం హర్షదాయకమన్నారు. పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు టి.సంపత్ కుమార్ మార్గదర్శనంలో 9వతరగతి విద్యార్థి ఎం.రాజాంజలి అగ్రికల్చర్ విభాగంలో,డి.హర్షిత(8వ తరగతి) యువ ఆవిష్కరణల విభాగంలో,ఎం.సమత(10వ తరగతి)రక్షణ భద్రత& సంరక్షణ విభాగంలో,కె.మధురిమ(9వ తరగతి) ఆరోగ్య సంరక్షణ శారీరక దృఢత్వం విభాగాల్లో తమ ఆవిష్కరణల ద్వారా రాణించినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణ వివరాలను కలెక్టర్ ఆరా తీసారు. విద్యార్థులు తాము రూపొందించిన ఎగ్జిబిట్స్ “అడవిపందులు,మిడతలు కోతులను పారద్రోలే ధ్వని పరికరం”, ‘బహుళ ప్రయోజనాల హెల్మెట్’, “వృద్ధులు&వికలాంగుల ఊతకర్ర”,’కరోనా వైరస్ నిర్మూలణకు గాలిని శుద్ధి చేయు యంత్రం’, ఆవిష్కరణల పై విద్యార్థులు వివరించారు. అంతర్జాతీయ పోటీలలో పాల్గొని బంగారు పతకానికి ఎంపిక కావడం ప్రశంసనీయమని , ఈ స్పూర్తితో జీవితంలో ముందుకు సాగాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని సాధన దిశగా కృషి చేయాలని, తల్లితండ్రులకు, మన జిల్లాకు , రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సర్టిఫికెట్లను, డిక్షనరీలను అందజేసి,విద్యార్థులలో స్పూర్తి నింపి గైడెన్స్ అందించిన పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు టి.సంపత్ కుమార్ ను శాలువాతో సత్కరించి అభినందించారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి,జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావు,ఎం.నరేష్ లు ,ప్రదానోపాధ్యాయులు ఎస్.సరళలు , విద్యార్థినులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post