విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చాలి,రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చాలి

కోటి రూపాయలతో నిర్మించిన జూనియర్ కళాశాల అదనపు తరగతులు ప్రారంభించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

విద్యార్థులు తమ కంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని అందుకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల  ఆకాంక్ష నెరవేర్చాలని ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్​ నాయకత్వంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందింస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కూకట్​పల్లి నియోజకవర్గంలో గల  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోటి రూపాయలతో నిర్మించిన అదనపు తరగతుల గదులను మంత్రి సబితా ఇంద్రారెడి, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి , ఎమ్మెల్సీ నవీన్​ రావు, కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఇంటర్ మీడియట్ చదువు ఒక టర్నింగ్ పాయింట్ అని ఈ సమయంలోనే విద్యార్థులు తమ కంటూ ఒక లక్ష్యాన్ని గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాలన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని అందుకుగాను తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తోందని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. విద్యార్థుల చదువులో వారి లక్ష్యసాధనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో కీలక పాత్ర పోషిస్తారని వారు కూడా విద్యార్థులకు దిక్సూచిలా నిలవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.  కరోనా సమయంలో ప్రభుత్వ విద్యా సంస్థలను తక్కువ అంచనా వేశారని కానీ ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లోనే మంచి సామర్థ్యం, చదువు, అవగాహన కలిగిన లెక్చరర్లు, టీచర్లు ఉంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకొనే విద్యార్థులకు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విద్యార్థికి రూ.1.25 లక్షల చొప్పున ఖర్చు చేస్తోందని … మంచి విద్యనందిస్తున్నందున చాలా మంది ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారని ఇది ఎంతో మంచి పరిణామమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉన్నత విద్యకు సంబంధించిన అవసరాలను, రాబోయే రోజుల్లో కావాల్సిన కోర్సులు తదితరాలను ఇప్పుడే అందించేందుకు సమాయాత్తమవతున్నారని… చదువు పూర్తవగానే ఉపాధి దొరికేలా చూస్తున్నారని పేర్కొన్నారు. అలాగే కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా టీ–శాట్​, డిజిటల్​ ఆన్​లైన్​ క్లాసులను ఏర్పాటు చేయడం జరిగిందని దానిని వినియోగించుకొని చాలా మంది విద్యార్థులు తమ చదువులు పూర్తి చేయడం ఎంతో గర్వకారణమని దీంతో దేశ వ్యాప్తంగా రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. కరోనా సమయంలో ఎంసెట్​ చదువుకొనే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి 20 వేల మంది విద్యార్థులకు  ఆన్​లైన్​ ద్వారా కోచింగ్​ తీసుకోగా అందులో రెండు వేల మంది విద్యార్థులు ఆయా కోర్సులకు సెలెక్టయ్యారని ఇది ఎంతో ఆనందంగా ఉందని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్న విద్యార్థులు మున్ముందు ఉన్నత స్థితికి చేరుకోవాలని పేర్కొన్నారు. అలాగే ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి కూడా మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ విద్యకు పెద్దపీఠ వేస్తున్నారని ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుండటంతో అందరూ ప్రభుత్వ విద్యా సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారని కనీసం సీట్లు దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి వసతులతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలలు,  కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు,  కళాశాలలు ఉన్నాయని అన్నారు.  దీంతో పాటు పేద విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా టీచర్లు,  లెక్చరర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రతి విద్యార్థి చదువు ప్రాముఖ్యతను తెలుసుకొని ముందుకు సాగాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల చదువు కోసం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ పేద,  మధ్యతరగతి విద్యార్థులకు సైతం ఉన్నత చదువులు చదివేలా అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పుడు విద్యార్థులను ఉన్నత చదువులు చదివించే అవకాశం కల్పిస్తోందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సైతం అందిపుచ్చుకొని చదవాలని మంత్రి మల్లారెడ్డి కోరారు.

కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలోని తమ నియోజకవర్గంలో విద్యార్థుల సౌకర్యార్థం మరిన్ని వసతులతో అదనపు తరగతి గదులను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ప్రైవేట్​ కళాశాలల మాదిరిగానే ప్రభుత్వ కళాశాలల్లో సైతం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి సహకరించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం మంచి విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సమావేశానికి ముందు కళాశాల  ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్​రావు, కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఇంటర్మీడియట్​ విద్యాశాఖ కమిషనర్​ సయ్యద్​ ఒమర్​ జలీల్​, కార్పొరేటర్ శిరీష బాబురావు,  కళాశాల ప్రిన్సిపాల్​తో పాటు రెవెన్యూ, మున్సిపల్​ శాఖల అధికారులు, కళాశాల  లెక్చరర్లు  సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post