విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని గట్టి పట్టుదలతో కృషి చేస్తే లక్ష్య సాధనకు తనవంతు సహకారం అందిస్తానని ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు విద్యార్థులకు భరోసా కల్పించారు. నాగర్ కర్నూల్ జిల్లా లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో నవంబర్ 29 నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల్ విజ్ఞాన ప్రదర్శనకు ముగింపు ఉత్సవానికి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సు పిల్లలు అయినా గొప్ప ఆలోచనలతో తమ ఆవిష్కరణలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రదర్శనలలో పాల్గొన్నారని ప్రశంసించారు. ఆవిష్కరణలు అనేవి ప్రజల సమస్యలు , అవసరాలు తీర్చేవిగా ఉండాలని అప్పుడే ప్రజలకు ఉపయోగ పడటమే కాకుండా అవిష్కరణలకు గుర్తింపు వస్తుందన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు హైదరాబాద్ లోని టి-హబ్ కు తీసుకువెళతానని ప్రకటించడమే కాకుండా విజేతలకు రూ. 2000 చొప్పున పారితోషికం, మెమోంటో లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థుల తమ ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ప్రజల సమస్యల పరిష్కారానికి సులువైన యాంత్రిక పరికరాలు ఉపయోగ పడేవిధంగా ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో సులువుగా పరిష్కరించే విధంగా నూతన ఆవిష్కరణలు అవిష్కరిస్తే తగిన గుర్తింపు పొందుతారని తెలియజేసారు. తన నిజ జీవితంలో తన మిత్రుడు 2011 లో ఆవిష్కరించిన లాజిస్టిక్ కంపెనీ జి.పి.ఎస్. ఆవిష్కరణ దానికి వచ్చిన ఆదరణను విద్యార్థులకు ఉదహరించారు. తన మిత్రుడు చేసిన ఆవిష్కరణకు రూ. లక్ష డాలర్లతో కోనుగోలు చేసారని తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వహణకర్త జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు మాట్లాడుతూ నవంబర్ 29 నుండి 3 రోజుల పాటు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 230 పాఠశాలలు పాల్గొని ఏడు అంశాలపై 486 ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు వనపర్తి జిల్లా నుండి 37 ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించడానికి జిల్లాలోని ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలల నుండి వేల సంఖ్యలో విద్యార్థులు హాజరైన స్ఫూర్తిని పొందినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,నోడల్ అధికారి కురుమయ్య, ఏసీ రాజశేఖర్ రావు, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్లు శెట్టి, ఎస్ పి సి ప్రసాద్ గౌడ్, వెంకటయ్య,సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు , సతీష్ కుమార్, వెంకటయ్య , సూర్య చైతన్య ,ప్రధానోపాధ్యాయుల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యందలి అందరూ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఆయా కమిటీల బాధ్యులు తాహెర్ పాషా, రాజేశ్వర్ రెడ్డి, వరలక్ష్మి, రాజయ్య, సంజీవ గౌడ్ ,జహంగీర్, బాబురావు,హన్మంత్ రెడ్డి ,మధు, మురళీధర్ రెడ్డి తదితరులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.