విద్యార్థులు విద్యపట్ల ఏకాగ్రత కలిగి ఉండి ఉన్నత విద్యాభ్యాసంతో తాము ఎనుకున్న రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు.

ప్రచురణార్ధం

అక్టోబరు, 08, ఖమ్మం:

విద్యార్థులు విద్యపట్ల ఏకాగ్రత కలిగి ఉండి ఉన్నత విద్యాభ్యాసంతో తాము ఎనుకున్న రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు. శుక్రవారం ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో బాణా డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముదిగొండ మండలం పదవతరగతిలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్షిప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్, మెమొంటో సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విద్యావకాశాలు కల్పించే బాధ్యత తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల పైనే ఉందని, పదవతరగతి అనంతరం విద్యార్థులు ఇంటర్మీడియట్ స్థాయి నుండే తమకు ఆసక్తి గల సబ్జెక్టులను ఎన్నుకొని తదనుగుణంగా ఉన్నత విద్యనభ్యసించాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికి విద్యార్థులు, తాము విద్యనభ్యసించిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు.

ఫౌండేషన్ ప్రసిడెంట్ ఆవుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముదిగొండ మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబర్చిన మెరిట్ విద్యార్థినీ విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు గాను 16 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని వారికి ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం 10 వేల రూపాయల చొప్పున 1 లక్షా 60 వేల రూపాయలు స్కాలర్షిప్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా బాణాపురం ప్రభుత్వ పాఠశాల 6 వ తరగతి నుండి 10 వ తరగతి లోపు మెరిట్ విద్యార్థులకు 5 వేల రూపాయల చొప్పున 10 మందికి 50 వేల రూపాయల స్కాలర్షిప్ అందిస్తున్నట్లు వివరించారు. ప్రతి సంవత్సరం 26 మంది చొప్పున రాబోయో నాలుగైదు సంవత్సరాలలో కనీసం 5 వందల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఫౌండేషన్ స్కాలర్షిప్ కో-ఆర్డినేటర్ అవుల భరత్రెడ్డి, రిటైర్డ్ మండల విద్యాశాఖాధికారి యం. నాగేశ్వరరావు, మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..

Share This Post