విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో విద్యాధికారులు, తొలి మెట్టు నోడల్ అధికారులతో తొలి మెట్టు కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్ధ్యాలతో పాటు తరగతికి సంబంధించిన అభ్యాసన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 44,486 మంది విద్యార్థులు ఉన్నట్లు ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలో 84 మంది మండల రిసోర్స్ పర్సన్ కు, మండల స్థాయిలో 2,293 మంది ఉపాధ్యాయులకు తొలి మెట్టు కార్యక్రమ అమలుపై శిక్షణ ఇచ్చినట్లు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు కార్యక్రమ అమలు పర్యవేక్షణకు అవగాహన కల్పించినట్లు ఆయన అన్నారు. ప్రాథమిక స్థాయి పిల్లలు, అక్షరాలను గుర్తించడం, పదాలు చదవడం, బేసిక్ మ్యాథ్స్ పై పట్టు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక పిల్లవాడు చక్కగా చదువుకోవాలి, రాయాలి అదేవిధంగా బేసిక్ మ్యాథ్స్ తెలిసేలా ఈ కార్యక్రమ కార్యాచరణ చేయాలన్నారు. చదువులో వెనుకబడి ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రాథమిక అభ్యసన వైపు తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. స్వల్పకాలిక లక్ష్యాలను ఏర్పరచుకొని వందశాతం సాధనకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, సిఎంఓ రాజశేఖర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ రవికుమార్, మండల విద్యాధికారులు, తొలి మెట్టు నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post