విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఎంపీ కల్లూరు మండలం పోచారం గ్రామంలో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని జెడ్పి చైర్మన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. త్రాగు, సాగు నీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇబ్బంది లేకుండా అందిస్తున్నామన్నారు. చదువు బాగుంటే, చదివిన పిల్లలు ఉన్నత స్థితిలో ఉంటే అట్టి గ్రామాలు బాగుంటాయన్నారు. విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 18600 కోట్లు కేటాయించి పెద్దఎత్తున విద్యపై ఖర్చు పెడుతుందన్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల ఏర్పాటుచేసిందని, మన రాష్ట్రం నుండే ఎక్కువ మంది డాక్టర్లు వస్తారని ఆయన తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలు అన్ని విధాలుగా బాగుచేసుకుంటున్నామన్నారు. రైతు పక్షపాతి తెలంగాణ ప్రభుత్వం అని, రైతు బంధు పెట్టి, ఇప్పటికి 60 వేల కోట్లు పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలకు జమచేసామన్నారు. 24 గంటల ఉచిత కరంట్ ఇచ్చేది భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని ఆయన అన్నారు. అన్ని రంగాలు, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తుందని అన్నారు.

కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ, విద్యతోనే అభివృద్ధి అని, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టి, పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన అన్నారు. జిల్లా పరిషత్ నుండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, మనిషి, సమాజ మార్పు చదువుతోనే అని, చదువే అన్నిటికీ పరిష్కారం అని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై దృష్టి పెట్టి, మంచి విద్యాబుద్ధులు అందించే విధంగా కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీలు చదువుకొనే పిల్లల స్కూళ్లను అప్ గ్రేడ్ చేసి, రెసిడెన్షియల్ స్కూళ్లుగా చేసుకున్నామన్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు లేవన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లకు భవనాలు, సదుపాయాలు, సౌకర్యాలతో అన్ని విధాలుగా తీర్చి దిద్దుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాల్లో రోల్ మోడల్ గా ఉందని, విద్య విషయంలో కూడా రోల్ మోడల్ అవ్వాలని, ఇందుకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ అన్నారు.
కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, అందరి సహకారంతో మంచి పాఠశాల భవనం నిర్మించుకున్నామన్నారు. సమాజంలో అన్ని ఉన్న విద్య లేకపోతే వెనుకబడిపోతామని, విద్యతోనే దేనినైనా జయించవచ్చని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో మండలంలో 23 పాఠశాలలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. చెన్నూర్ లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉన్న, రూ. 10.50 కోట్లతో కల్లూరులో 50 పడకల ఆసుపత్రి మంజూరు అయిందని అన్నారు. ఇకపై మెరుగైన వైద్యానికి ఖమ్మం, ప్రయివేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, కల్లూరులోనే మంచి వైద్యం అందుతుందని ఆయన అన్నారు. చిన్న గ్రామంలో 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్నట్లు, 70 లక్షలతో అభివృద్ధి పనులు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి, రైతుబంధు, రైతుభీమా, ధాన్యం కొనుగోలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, పాఠశాల గ్రామంలో ఉండగా, పిల్లలు ఎస్సి కాలనీ నుండి వస్తున్నట్లు, ఎంతో ఇబ్బందిగా ఉందని దృష్టికి తేగా, డిమాండ్ ఉన్న చోటుకు తరలింపుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే మంచి స్కూల్ భవనం కట్టుకొని ప్రారంభం చేసుకుంటున్నామన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ కమిటీ, హెచ్ఎం, టీచర్లు శ్రద్ధ తీసుకొని పాఠశాలను అభివృద్ధి చేయాలని, నమోదులు పెంచాలని అన్నారు. నమోదులు పెరిగితే, మన ఊరు-మన బడి క్రింద నిధులతో అన్ని విధాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించుకోవచ్చని అన్నారు. పిల్లలు మంచిగా చదువుకొని, ఉన్నత స్ధాయికి చేరాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉమామహేశ్వరరావు, డిసిఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, రైతు బంధు జిల్లా కన్వీనర్ ఎన్. వేంకటేశ్వర రావు, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, ఇ ఇ నాగశేషు, ఎంపిపి రఘు, జెడ్పిటిసి అంజయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post