వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన–1 తేదీ : 25–08–2022
=========================================
వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
పండగ రోజు మొదలుకొని నిమజ్జనం వరకు పూర్తిస్థాయిలో పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి
వినాయక నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో సమీక్ష సమావేశం
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
గురువారం షామీర్పేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ఈ నెల 31 నుండి సెప్టెంబరు 9 వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపినారు. జిల్లా వ్యాప్తంగా పండగలు ప్రశాంత వాతావరణంలో భక్తిపారవశ్యంతో జరిగేలా చూడాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో ఎక్కడ వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. అందుకు సంబంధించి మండపాల ఏర్పాటుకు, రహదారుల మరమ్మతులు, విద్యుత్తు సరఫరాకు సంబంధించి వివరాలతో పాటు మండపాల వద్ద పండగ రోజు నుంచి మొదలుకొని నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని శాఖల ఆయా నిర్వాహకులు సంబంధిత అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు వినాయక చవితి పండగ రోజు నుంచి నిమజ్జనం వరకు అన్ని చెరువులు వద్ద బ్యారీకేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు అందుబాటులో ఉండేలా మెడికల్ కిట్లు, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ, వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 17 చెరువులు, వున్నాయి అని ఆయా ప్రాంతాల్లో గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాల్సిందిగా మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. వినాయక నిమజ్జనంకు సంబంధించి ఆయా చెరువులు, కుంటల వద్ద క్రేన్లను అందుబాటులో ఉంచాలని ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని పూర్తి కార్యాచరణ ప్రణాళికతో పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ప్రతినిత్యం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉండాలని భక్తిపారవశ్యం కనిపించేలా ఉండాలని కలెక్టర్ హరీశ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కొన్ని సమస్యలను సమావేశంలో ప్రస్తావించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో అధికారులతో ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, బాలానగర్ డీసీపీ సందీప్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, పోలీస్ అధికారులు, ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఉత్సవ కమిటీ సభ్యులు, బాధ్యులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post