వినికిడి లోపం ఉన్న ఏ ఒక్క పిల్లలు విద్యకు దూరం కావద్దు – జిల్లా కలెక్టర్ డి. హరిచందన.

పత్రిక ప్రకటన

తేది: 7-9-2021

నారాయణపేట జిల్లా

 

వినికిడి లోపం ఉన్న ఏ ఒక్క పిల్లలు విద్యకు దూరం కావద్దు – జిల్లా కలెక్టర్ డి. హరిచందన.

వినికిడి లోపం ఉందని, మాటలు రావని పిల్లలను విద్యకు దూరం చేయవద్దని  కలెక్టర్ హరిచందన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసారు.  మంగళవారం ఉదయం స్థానిక షీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లొ  జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో     పుట్టుకతో వినికిడి లోపం, మాట్లాడకపోవడం వంటి లక్షణాలు కలిగిన 0-18 సంవత్సరాల వయస్సు పిల్లలకు వైద్య పరీక్షలు, వినికిడి పరికరాలు ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో జాతీయ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వినికిడి పరికరాలు అందజేయడంతో పాటుగా వచ్చిన పిల్లలను వారికి విద్యాభ్యాసానికై  అనువైన పాఠశాలల్లో ప్రవేశం కల్పించారు.  సంజ్ఞల ద్వారా విద్యాభ్యాసం చేసే పాఠశాలలు రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, మిర్యాలగూడ లో మాత్రమే ఉన్నాయి.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తల్లుదండ్రులు వారికి తెలియక తమ పిల్లవాడికి వినపడదు, మాట్లాడడు అని నిర్లక్ష్యం చేసి విద్యకు దూరం చేస్తుంటారని అందుకే ఈ జిల్లాలో ని అందరూ వినికిడి లోపం ఉన్న పిల్లలకు వినికిడి యంత్రాలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అనువైన పాఠశాలల్లో ప్రవేశం క్షల్పించడం జరుగుతుందన్నారు.  తల్లిదండ్రులకు పైసా ఖర్చు లేకుండా పిల్లలకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తూ వారికి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు.  ఈ రోజు జిల్లాలోని 5 మండలాలు దామరగిద్ద, మద్దూరు, కోస్గి, ధన్వాడ, ఊట్కూరు, నారాయణపేట వారిని పిలిపించడం జరిగిందని రేపు మిగిలిన మండలాల పిల్లలను పిలిపించడం జరుగుతుందన్నారు. ఈ రోజు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు వారికి తెలిసిన మిగతా పిల్లలకు సైతం సమాచారం ఇచ్చి ఈ రోజు రాని వారు రేపు వచ్చి తమ పిల్లలకు వైద్య పరీక్షలు చేయించి పాఠశాలల్లో ఉచిత ప్రవేశం తీసుకోవాలని కోరారు.  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వినికిడి లోపం ఉన్న దివ్యంగా పిల్లలకు విద్యాభ్యాసం చేయించేందుకు ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆడియాలజిస్ట్ సంగీత మాట్లాడుతూ వినికిడి లోపం వల్ల మాటలు రావని, అదేవిధంగా మానసిక అభివృద్ధి సైతం ఆగిపోతుందన్నారు.  ఇలాంటి పిల్లలను సకాలంలో గుర్తించి తగిన వైద్యంతో పాటు అనువైన పాఠశాలల్లో చేర్పించిన యెడల మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ రోజు వచ్చిన దాదాపు 150 మంది పిల్లలకు ఆధునిక వినికీడి యంత్రాలు ఇవ్వడమే కాకుండా వారికి తగిన పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం జరుగుతుందని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ రావు, ఆడియాలజిస్ట్ శ్రీనివాస్ రావు, పిల్లల తలిదండ్రులు పాల్గొన్నారు.

———————-

జిల్లా పౌర సంబంధాల అధికారి నారాయణపేట ద్వారా జారీ.

Share This Post