వినియోగదారులు- హక్కుల పట్ల అవగాహణ కలిగి ఉండాలి :: అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు

ప్రచురణార్థం-2
జనగామ, డిసెంబర్ 24: వినియోగదారులు హక్కులు పట్ల అవగాహణ కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భద్రతా హక్కు అంటే ఆరోగ్యానికి లేదా జీవితానికి ప్రమాదకరంగా పరిణమించే వస్తు సేవల నుండి రక్షించబడే హక్కుని అన్నారు. వినియోగదారుల యెక్క దీర్ఘకాల ప్రయోజనాలు, తక్షణ అవసరాలు పొందవచ్చన్నారు. సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారునికి ఉందని ఆయన తెలిపారు. వినియోగదారుడు తమ సమస్యల పరిష్కారం కొరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్ లలో ఫిర్యాదు చేసి సత్వర పరిష్కారం పొందే వీలుందన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం- 2019 ప్రకారం కొనుగోలు చేసిన వస్తు సేవల విలువ ఒక కోటి రూపాయల లోపు ఉంటే జిల్లా కమిషన్ లోనూ, ఒక కోటి నుండి పది కోట్ల వరకు అయితే రాష్ట్ర కమిషన్ లోనూ, పది కోట్లకు పైబడి ఉంటే నేరుగా జాతీయ కమిషన్ లోనూ ఫిర్యాదు చేసి అతి తక్కువ రుసుముతో పరిష్కారం పొందవవచ్చున్నారు. అలాగే, ఇదివరకటిలా కాకుండా, మోసపోయిన వినియోగదారుడు దేశములో ఎక్కడైనా ఫిర్యాదు చేసి న్యాయాన్ని పొందే హక్కు ఉందన్నారు. నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయలేని వినియోగదారులకు ఆన్ లైన్ పద్దతిలో ఫిర్యాదు చేసే విలున్నదని,విచారణకు నేరుగా హాజరు కాలేని వినియోగదారుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించుకునే సౌలభ్యం కూడా ఈ కొత్త చట్టంలో ఉందని అన్నారు. ప్రతి వినియోగదారుడు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వినియోగదారుల రక్షణ చట్టం- 2019 పై అవగాహన పెంచుకుని ప్రభుత్వాలు తమకు కల్పించిన సదుపాయాలను సమర్ధవంతగా వినియోగించుకోవాలని అన్నారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను జాతీయ వినియోగదారుల వ్యవహారాల విభాగం యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-4000 ద్వారా, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 00 333 / 1967 ద్వారా నమోదు చేసుకొని సమస్యల పరిష్కరించుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఈ సమావేశంలో జనగామ ఆర్డీఓ మధుమోహన్, డిసిఎస్ఓ రోజారాణి, డిఎం సంద్యారాణి, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్, డిఎంఓ ఆర్టీసి, ఫుడ్ ఇన్స్పెక్టర్, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post