వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది – అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ యుగం నడుస్తుండటంతో వినియోగదారుడు గాని ఉత్పత్తిదారుడు గాని కనిపించని పరిస్థితులు ఏర్పడిన వినియోగదారులు మోసాలకు గురయ్యే అవకాశం ఉన్నదని దీనిని అరికట్టడానికి వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 తీసుకురావడం జరిగిందని తద్వారా వినియోగదారునికి జరిగే మోసాలను చట్టం దృష్టికి తీసుకువచ్చి న్యాయం చేసే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ హక్కులకు సంబంధించి వినియోగదారులకు ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి చైతన్యం కల్పించడం ద్వారా మోసాలను గుర్తించి నష్ట పరిహారం అందించడమే కాక మోసం చేసిన వారికి శిక్షలు జరిమానాలు విధించడానికి కూడా ఈ చట్టం వెసులుబాటు కల్పించింది అని పేర్కొన్నారు. అధికారులు వినియోగ సంఘాలవారు ఈ దిశగా ప్రజల కోసం అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరానికి “వినియోగదారుడా నీ హక్కులు తెలుసుకో” అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. పెద్ద పెద్ద దుకాణాల్లో టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు ఫిర్యాదుల పెట్టె వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయించాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో ఈ సంవత్సరం నవంబర్ వరకు 6,786 ఫిర్యాదులు రాగా ఇప్పటివరకు 6,604 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా “భారతీయ వినియోగదారులకు ఎ టర్నింగ్ పాయింట్/ఒక మలుపు – వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019” అనే కరపత్రాన్ని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో డి సి ఎస్ ఓ వెంకటేశ్వరరావు, నిజామాబాద్ ఆర్డీవో రవి, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు రాజేశ్వర్, పలు సంఘాల ప్రతినిధులు, పెట్రోల్ బంకుల ప్రతినిధులు, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post