విపత్తు సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి –కలెక్టర్ హరీష్

విపత్తు సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి –కలెక్టర్ హరీష్

ఉరుములు, మెరుపులు, పిడుగులు, కుంభవృష్టి, వడగళ్ల వాన, బలమైన ఈదురు గాలులు, దుమ్ముదూళి వంటి విపత్తు సంభవించినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలలో అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇట్టి విపత్కర పరిస్థితులలో చేయవలసినవి, చేయకూడని పనుల పట్ల ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని, అట్టి వివరాలను www.ndma.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చని ఆయన తెలిపారు. 2019 లోనే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్త సలహాదారు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇట్టి విపత్తును ఎదుర్కోవడానికి, సన్నద్ధం కావడానికి, విపత్తును నివారణకు కార్యాచరణ రూపొందించిందని ఆయన తెలిపారు. ప్రాణ నష్టాన్ని నివారించడానికి IMD జారీచేసిన నౌకాస్ట్ హెచ్చరికలు, ఉరుములతో కూడిన తుఫాను కదలికలపై IITM ద్వారా దామిని మొబైల్ యాప్ లో భాగస్వామ్యం చేయబడినదాని నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విపత్తు సమయంలో ఈ దిగువ తెలిపిన విధంగా చేయవలసినవి, చేయగూడని పనులపై మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూ అవగాహన కల్పించాలని ఇటీవల ఆదేశాలు జారీచేసిందని కలెక్టర్ తెలిపారు.
…. ఉరుములు, మెరుపులు వస్తున్నట్లు వాతావరణం కనిపిస్తే ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం, పశువులను మేపడం, చేపలు పట్టడం వంటిని మానుకోవాలి. సమీపంలోని సురక్షితమైన ప్రాంతంలో ఆశ్రయం పొందాలి. ప్రమాదవశాత్తు అటవీ ప్రాంతంలో చిక్కుకున్నట్లయితే చిన్న చెట్ల క్రింద తలదాచుకోవాలి. కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్నట్లైతే స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ స్థంబాలు, చెట్ల క్రింద ఆశ్రయం పొందవద్దు. వివిధ కమ్యూనికేషన్ మాధ్యమాల ద్వారా తాజా సమాచారాన్ని, హెచ్చరికలను తెలుసుకుంటూ అప్రమత్తం కావాలి. ఎలక్ట్రిక్ వస్తువులను ఆన్ ప్లగ్ చేయాలి. పిడుగులు పడే సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. తుపాను సమయంలో సహాయం అందే వరకు లేదా తుపాను ఆగిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలి. పిడుగుపాటుకు గురైన వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడా, గుండె కొట్టుకుంటుందా అని నాడి చెక్ చేయాలి. శ్వాస తీసుకోకపోతే వెంటనే నోటి నుండి నోటికి ఊపిరి అందించాలి. కార్డియాక్ కంప్రెషలను ప్రారంభించాలి. అలాగే మెరుపు దాడి నుండి బయటపడిన వ్యక్తికీ పక్షవాతం లేదా రక్తస్రావము అవుతున్న, ఎముకలు విరిగిపోయిన తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించి వైద్య సహాయం అందించాలి. ఇలా చేయవల్సిన, చేయకూడని పనులపై స్పష్టంగా పేర్కొంటూ వైబ్ సైట్ లో పొందుపరచిన సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని విపత్తు సమయంలో ధైర్యంగా ఎదుర్కొని బయటపడాలని కలెక్టర్ సూచించారు.

Share This Post