@ అభివృద్ధిలో గ్రామాలు పట్టణాలతో పోటీపడుతున్నాయి
@ విలీన గ్రామాలను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రామాలు సైతం పట్టణాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లి, లక్ష్మణ్ నాయక్ ,నీలి నాయక్ తండాలలో సుమారు 81 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో గ్రామాలన్ని దుర్గంధంతో, ఎలాంటి సౌకర్యాలు లేక, గ్రామీణ ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ,కాని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో సైతం సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యం, ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ,నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు వంటి ఎన్నో ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, ఇతర పథకాలతో ప్రజలు సైతం సంతోషంగా ఉన్నారని అన్నారు. త్వరలోనే మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని వార్డులతో పాటు, అన్ని విలీన గ్రామాలలో పర్యటించి సమస్యలను గుర్తించి మిగిలిపోయిన సమస్యలన్నింటిని తీరుస్తానని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నదని, 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, కంటి ఆద్దాలను కూడా పంపిణీ చేస్తున్నదని ,అందువల్ల ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అర్హులైన వారందరిని గుర్తించి కంటి వెలుగు శిబిరాలకు తీసుకువచ్చి వారందరికీ ఉచిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మున్సిపల్ చైర్మన్ కే.సీ .నరసింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీర్ సుబ్రమణ్యం, కౌన్సిలర్ లతాశ్రీ లక్ష్మణ్ నాయక్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.