విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

అత్యధిక జనాభా… అత్యల్ప వైద్య సదుపాయాలు..

మెడికల్ కళాశాలల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష…

రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం మూడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు

తెలంగాణలో కొత్తగా 20 మెడికల్ కళాశాలలు మన ఘనత

రాష్ట్రంలో తొలి మెడికల్ కళాశాల మనదే

పాలమూరును హైదరాబాద్ స్థాయిలో మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతాం

నక్లెస్ రోడ్ బ్యూటిఫుల్ కోసం రూ. 49 కోట్లు విడుదల

సాధ్యమైనంత త్వరగా పాలమూరు ప్రాజెక్టు పనులు

– విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, నవంబర్ 15:

ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా ఉన్న దేశమైనప్పటికీ స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అత్యల్ప వైద్య సదుపాయాలు మన దేశ వాసులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మెడికల్ కళాశాలల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

దేశంలో మెడికల్ విద్యకు సరైన అవకాశాలు లేక ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లి అక్కడ సంభవించిన యుద్ధం వల్ల మన విద్యార్థులు అనేక కష్టాలు పడాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఏర్పడేందుకు ముందు కేవలం మూడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్తగా 20 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటు వల్ల వైద్య విద్యను అభ్యసించేందుకు ఇతర దేశాలపై ఆధారపడడం సాధ్యమైనంత మేర తగ్గుతుందన్నారు. వైద్యుల సంఖ్య పెరిగి మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో తొలి మెడికల్ కళాశాల మనదే అవ్వడం మహబూబ్ నగర్ జిల్లా వాసుల అదృష్టమన్నారు. పాలమూరును హైదరాబాద్ స్థాయిలో మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు రూ 500 కోట్లతో పాత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధునాతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు.

అద్భుతమైన డెస్టినేషన్ గా మినీ ట్యాంక్ బండ్…

పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్లను సుందరమైన పర్యాటక ప్రాంతంగా మారుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నెక్లెస్ రోడ్డుకు ఇరువైపులా, ఐలాండ్ లో సుందరీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.49 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మినీ ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జ్, శిల్పారామం మొదలైన నిర్మాణాల వల్ల పట్టణం పర్యటకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నారు.

కేసుల పరిష్కారమైన వెంటనే పాలమూరు పనులు పూర్తి

పాలమూరు ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కొందరు వేసిన కేసులు పరిష్కారమైన వెంటనే సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి సాగునీటిని అందించేందుకు అధికారులతో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. గతంలో పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చిన సుష్మా స్వరాజ్, ప్రధాని మోడీ… మాట తప్పకుండా వారిచ్చిన హామీ మేరకు జాతీయోద ఇస్తే ఇంకా త్వరగా పనులు పూర్తవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాకు అదనంగా 20 చెక్ డ్యాములు మంజూరు అయ్యాయని వీటి ద్వారా బుగ్గల పెంపునకు మరింత అవకాశం ఏర్పడిందన్నారు. హెచ్ఎండిఏ తర్వాత అతి పెద్దదైన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ “ముడా” ఏర్పాటు వల్ల మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చెందనుందన్నారు. రాష్ట్రంలోనే తొలి మెడికల్ కళాశాల, దివిటిపల్లి ఇండస్ట్రియల్ కారిడార్, హన్వాడ ఫుడ్ పార్క్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్లు సీతారామరాజు తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, పర్యాటకశాఖ కన్సల్టెంట్లు, ఇతర అధికారులున్నారు.

 

Share This Post