మంగళవారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా వైద్య అధికారులు, జిల్లా పరిషత్ సీఈవో లు, జిల్లా పంచాయతీ అధికారులతో జిల్లాల వారిగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆశా, అంగన్వాడి, పంచాయతీ సెక్రెటరీ, విఆర్ఏ, రేషన్ షాప్ డీలర్లతో కూడిన విలేజ్ లెవెల్ మల్టీ డిసిప్లినరీ టీములు స్పెషలాఫీసర్ల పర్యవేక్షణలో ప్రతి ఇల్లు సర్వే చేసి వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని, సర్వేలో ఎవరు మొదటి డోస్ తీసుకున్నారు, ఎవరు రెండవ డోస్ తీసుకున్నారు, ఎవరు అసలే వాక్సిన్ తీసుకోలేదు అనే వివరాలను సేకరించాలని, వాక్సిన్ కార్యక్రమాన్ని 100 శాతం నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ఐదు కోట్ల 60 లక్షల మందికి లక్ష్యానికి గాను 3 కోట్ల 5 లక్షల మందికి వాక్సిన్ వేశామని, 100 శాతం వ్యాక్సినేషన్ వేయడమే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో రోజు వారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని వివరిస్తూ, జిల్లాలో 5 లక్షల 23 వేల మందికి మొదటి డోస్ లక్ష్యానికి గాను 4 లక్షల 28,467 మందికి వేసి 82 శాతం లక్ష్యం సాధించడం జరిగిందని, దీనిలో 2 లక్షల, 1775 మందికి రెండవ డోస్ వేయడం జరిగిందని, 47.09 శాతం సాధించడం జరిగిందని, ఇప్పటి వరకు 170 ఆవాసాలు, 20 వార్డుల్లో వంద శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 17 వేల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మండల స్పెషల్ ఆఫీసర్స్, అధికారులతో గ్రామాలలో వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో విలేజ్ లెవల్ మల్టీ డిసిప్లిన్ టీములు, గ్రామ స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ నోడల్ అధికారుల సమన్వయంతో డోర్ టు డోర్ సర్వే చేపట్టి 100 శాతం వ్యాక్సినేషన్ నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య అధికారి సాంబశివరావు, జిల్లా పరిషత్ సిఇఓ క్రిష్ణా రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద పాల్గొన్నారు.

