*విశ్వకర్మల జీవితాలలో కొత్త వెలుగును చూస్తాం*
గోదావరి జీవనదినే ఎత్తి పోసి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కెసిఆర్ కార్పెంటర్ వృత్తికారుల జీవితాల జీవన ప్రమాణాలను కూడా పెంచి తీరుతారన్న విశ్వాసం గెలిచితీరుతుందని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఆదివారం భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో వరంగల్ విశ్వబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన విశ్వకర్మియుల ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని జూలూరు ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అన్ని రంగాలను పునర్నిర్మించుకు న్నట్లుగానే విశ్వకర్మలైన పంచకర్మ కులస్తుల జీవితాలు కూడా బాగుపడతాయన్నారు. వడ్రంగి వృత్తిని ఆధునికరించుకునే విధానాలను ఆలోచించి కార్యాచరణ రూపొందించే పనిలో బీసి మంత్రిత్వశాఖ ఉందని చెప్పారు. విశ్వకర్మ కులస్తులలో సృజనాత్మకత ఉందని దాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మల్చుకుంటే అత్యంత అద్భుత మానవ వనరులను సృష్టించే శ్రమశక్తి రూపాలవుతారని భావోద్వేగంతో ప్రసంగించారు. తెలంగాణ వచ్చాక కులవృత్తులు స్థిమిత పడుతున్నాయని గ్రామీణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని విశ్లేషించారు. అందులో విశ్వకర్మల జీవితాలు కూడా బాగుపడి తీరుతాయన్న ధీమా వ్యక్తం చేశారు.
హన్మకొండ ఎం ఎల్ ఎ వినయ భాస్కర్ మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధికి అండగా నిలుస్తానన్నారు..
తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం గౌరవాధ్యక్షులు డా.లాల్ కోట వెంకటాచారి మాట్లాడుతూ విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను వేతకాలన్నారు. ఈ కార్యక్రమ సమన్వయ కర్త విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా కొన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ప్రసంగాలు చేశారు. విశ్వకర్మ కులం నుంచి ఎదిగి వచ్చిన పలుగురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలలో అత్యధిక సంఖ్యలో విశ్వకర్మియులు, భక్తులు హాజరయ్యారు.
*జూలూరు గౌరీశంకర్*
ఛైర్మన్ తెలంగాణ సాహిత్య అకాడమీ.