వీటీఏడీఏ ద్వారా ప్రణాళికాబద్ధంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి చర్యలు : అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 15: వేములవాడ దేవస్థాన అభివృద్ధి అథారిటీ ద్వారా ప్రణాళికాబద్ధంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వేములవాడ పట్టణ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కన్సల్టెన్సీ వారు ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పట్టణ ప్రజలకు, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి పారుదల, రవాణా, ఆలయ అభివృద్ధి, విద్యుత్ సరఫరా, తదితరాల గురించి ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన చర్యల గురించి సంబంధిత శాఖ అధికారులకు కన్సల్టెన్సీ సభ్యులు తెలియజేశారు. ఏదైనా శాఖ పరంగా మార్పు చేర్పులు ఉంటే వెంటనే కన్సల్టెన్సీ సభ్యులకు తెలియజేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. తద్వారా రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో మార్పులు సులువుగా చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సమీక్షలో వేములవాడ ఆర్డీఓ వి.లీల, నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, తహశీల్దార్లు మునీందర్, శ్రీనివాస్, డీటీఓ కొండల్ రావు, జిల్లా వైద్యారోగ్య శాఖ డా. సుమన్ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post