వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్.

ఓటర్ల సవరణ జాబితాలు వేగవంతంగా పూర్తి చేయాలి

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి

ఓటరు హెల్ప్ లైన్ యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్

అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
00000

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు.

సోమవారం ఓటర్ నమోదు కార్యక్రమం, గరుడ యాప్, ఓటర్ హెల్ప్ లైన్ వినియోగం, నిధుల సద్వినియోగం పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని అన్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు. ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ గరుడ ఆప్ రూపొందించిందని దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఓటరు హెల్ప్ లైన్ యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ఈవీఎం గోదాములను ప్రతిమాసం తనిఖీ చేయాలని అన్నారు. ప్రభుత్వ నిధులను సక్రమంగా సద్వినియోగం చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ. శ్యామ్ ప్రసాద్ లాల్, డి ఆర్ డి ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Share This Post