వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్.

హుజరాబాద్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్

ఉప ఎన్నిక సన్నద్ధం పై వీడియో కాన్ఫరెన్స్
000000

హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ, అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, హుజురాబాద్ ఆర్డీవో రిటర్నింగ్ అధికారి సిహెచ్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్, టాయిలెట్ల సౌకర్యంతో పాటు వీల్ చైర్ ఉండేలా చూడాలని తెలిపారు. ఓటర్లు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతారు అని వారి కోసం షామియానాలు ఏర్పాటుచేసి కుర్చీలు వేయాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి సిద్ధంగా పెట్టుకోవాలని తెలిపారు. ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ లు, ప్యాట్లు సిద్ధం చేయడంతో పాటు రిజర్వ్ లో కూడా పెట్టుకోవాలని తెలిపారు. పోలింగ్ రోజు ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే రిజర్వ్ ఈవీఎంలను అందించాలని అన్నారు. పోలింగ్ రోజు ఉదయము తప్పనిసరిగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని తెలిపారు. మాక్ పోలింగ్ తర్వాత వివి ప్యాట్ ల లోని స్లిప్పులు తొలగించి సీల్ చేయాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తీయించాలని అన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చామని అన్నారు. ఓటర్ల జాబితాలను సిద్ధంచేసి పొలిటికల్ పార్టీల అభ్యర్థులకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇచ్చామని తెలిపారు. ఈవీఎంల కమిషనింగ్ పూర్తిచేశామని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు సిద్ధంగా చేసి ఉంచామని తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే పోలింగ్ సంబంధించి విద్యుత్ సౌకర్యం తో పాటు ప్రతి పోలింగ్ కేంద్రానికి సోలార్ లాంతర్లను అందచేస్తున్నామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని ఈ డెస్క్ లో ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉంటారని అన్నారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రిజర్వు ఈవీఎంల తో పాటు బ్యాటరీలు కూడా రిజర్వులో ఏర్పాటు చేశామని అన్నారు. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ నిర్వహిస్తామని తెలిపారు. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు, వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నవారు హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ ఏరియా ఆస్పత్రులలో ఏర్పాటుచేసిన ఆర్ టి పి సి ఆర్ సెంటర్ నుంచి సర్టిఫికెట్ తీసుక వస్తే పోలింగ్ ఏజెంట్లకు, కౌంటింగ్ ఏజెంట్ లకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేస్తున్నామని తెలిపారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎంహెచ్ఓ డాక్టర్ జువెరియా, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post