దళిత బంధు లబ్ధిదారుల సందేహ నివృత్తి కోసం బ్యాంకులలో హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు
బ్యాంకు ఖాతాలో నిల్వ ఉండే దళిత బంధు నగదుకు ప్రతి నెల వడ్డీ జమ
జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్ బ్యాంకులలో హెల్ప్ డెస్క్ లు ప్రారంభించిన కలెక్టర్
00000
హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు పథకం అమలుపై లబ్ధిదారులకు కలిగే సందేహాలను నివృత్తి చేసేందుకు అన్ని బ్యాంకులలో హెల్ప్ డెస్క్ లు (సహాయ కేంద్రాలను) ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.
శుక్రవారం వీణవంక మండల కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వీణవంక శాఖలో, జమ్మికుంట మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి ఐ), యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జమ్మికుంట శాఖలలో, హుజురాబాద్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఏర్పాటు చేసిన తెలంగాణ దళిత బంధు సహాయక కేంద్రాలను కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం దళిత బంధు పథకం ద్వారా నగదు జమ అయ్యిందా లేదా అని తెలుసుకునేందుకు ఆయా బ్యాంకుల లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. లబ్ధిదారుల పేర్లు, ఖాతా నెంబర్ ను సహాయ కేంద్రం లోని కంప్యూటర్లో నమోదు చేసి వివరాలు పరిశీలించారు. నగదు జమ అయినట్లు కంప్యూటర్ లో కనిపించగా లబ్ధిదారులకు తెలిపారు. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేసి కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన దళిత కుటుంబాల అందరికీ ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకం డబ్బులు ఖాతాలో జమ అయ్యాయని, ఎవరు కూడా ఆందోళన చెంద వద్దని కలెక్టర్ లబ్ధిదారులకు సూచించారు. దళిత బంధు పథకం డబ్బులు జమ పై సెల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం రాని లబ్ధిదారులు వారికి కేటాయించిన బ్యాంకుల లోని సహాయ కేంద్రం ( హెల్ప్ డెస్క్ )కు వచ్చి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు తమ ఖాతాల్లో జమ అయిన నగదుతో స్వయం ఉపాధి యూనిట్లు ప్రారంభించు కునేంత వరకు ఖాతాలో నిల్వ ఉన్న నగదుకు ప్రతి నెల రూ. 2475/- చొప్పున వడ్డీ జమ అవుతుందని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. దళిత బంధు పథకం డబ్బులతో లాభసాటి యూనిట్లను స్థాపించు కొని ఆర్థికంగా ఎదగాలని కోరారు.
వీణవంక బ్యాంకు లో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ హరి రామ్ నాయక్, కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సి ఈ ఓ సత్యనారాయణ, జనరల్ మేనేజర్ రియాజ్, తహసిల్దార్ సరిత తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మండల కేంద్రంలోని బ్యాంకులలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాల ప్రారంభోత్సవంలో ఆయా బ్యాంకుల మేనేజర్లు పి. గోపీచంద్, బి. రాకేష్, వి వి వి ఎస్. సాయి కృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే. లక్ష్మణ్, తహసిల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రం ప్రారంభోత్సవంలో బ్యాంకు మేనేజర్ కిషోర్, హుజరాబాద్ ఆర్డీవో రవీందర్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.