వీధి వ్యాపారులు రోడ్డు ప్రక్కన కాకుండా మార్కెట్ సముదాయాలలోనే విక్రయాలు కొనసాగించే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సూచించారు.

ప్రచురణార్ధం

జనవరి, 03 ఖమ్మం:

వీధి వ్యాపారులు రోడ్డు ప్రక్కన కాకుండా మార్కెట్ సముదాయాలలోనే విక్రయాలు కొనసాగించే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సూచించారు. నగరంలోని నూతన బాస్ స్టాండ్ ప్రక్కన గల సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ను సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నాన్-వెజ్ మార్కెట్ విభాగంలో గల చేపలు..మాం సాహార విక్రయ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. చేపల విక్రయదారులకు కేటాయించబడిన షాపులలో కాకుండా మార్కెట్ ప్రవేశ మార్గంలో విక్రయాలు జరపడం పట్ల, విక్రయదారుల సమస్యలను తెలుసుకున్నారు. నగరంలో వివిధ ప్రాంతాలలో రోడ్ల ప్రక్కన చేపల విక్రయాలు జరపడం వల్ల మార్కెట్లో విక్రయాలు సరిగా లేకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని, చేపల విక్రయదారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై సత్వరమే స్పందించి రోడ్డు ప్రక్కన విక్రయాలను నియంత్రించాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నాన్వెజ్ విక్రయాల కొరకు కేటాయించబడిన షాపులలోనే విక్రయాలు జరిగేలా అవసరమైన ఏర్పాట్లను సమకూర్చాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కూరగాయల విక్రయ ప్రాంగణాన్ని కలెక్టర్ సందర్శించి మార్కెట్లో సౌకర్యాలపై వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని వీధి వ్యాపారుల సౌకర్యార్థం సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ను అన్ని వసతులతో అందుబాటులోకి తేవడం జరిగిందని, వీధి వ్యాపారులందరూ మార్కెట్ సముదాయంలోనే విక్రయాలు జరిపేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయ సమీపంలో జరుగుతున్న మోడల్ వెజ్- నాన్వెజ్ మార్కెట్ పనులను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, మార్కెట్ ఎస్టేట్ అధికారి శ్వేత, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారి కృష్ణలాల్, అర్బన్ తహశీల్దారు శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post