వృద్ధాశ్రమం నిర్వహణలో స్వచ్చంద సంస్థ సేవలు అభినందనీయం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

వయో వృద్దులు సంక్షేమం కోసం, గ్రామీణ స్వయం ఉపాధి అవకాశాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థ శ్రీ షిర్డీ సాయి సేవ సొసైటీ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. తలమడుగు మండలం సాయి లింగి గ్రామం లో గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రం, బస్సు షెల్టర్, డైనింగ్ హాల్ లను కలెక్టర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వచ్చంద సేవ సంస్థ వృద్దులకు, యువతకు అందిస్తున్న సేవలను కొనియాడారు. సీనియర్ సిటిజన్ ల సంఖ్య పెరుగుతున్నదని, వారి సంక్షేమం కోసం కుటుంబాలు, ప్రభుత్వం కృషి చేయాలనీ అన్నారు. వయోవృద్ధుల క్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నదని, పరిశ్రమల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ ద్వారా ప్రోత్సాహకాలు, రాయితీలు, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. వృద్దులకు రక్త పరీక్షల కోసం సమీపం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు రిమ్స్ ఆసుపత్రిలో రెండు కోట్లతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపించడం జరుగుచున్నదని తెలిపారు. వృద్దులకు అవసరమైన ఫిజియో థెరపీ కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వయో వృద్దులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంయుక్త భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, ముఖ్యంగా ఆరవై ఏళ్లకు పైబడిన వారు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. శ్రీ షిర్డీ సాయి సేవ సొసైటీ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్ మాట్లాడుతూ, గుడి, బడి, తడి, ఒడి అనే నినాదంతో కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. సాయి లింగి లోనే కాకుండా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయి లింగి గ్రామంలో సాయి మందిరాన్ని నిర్మించామని, గ్రామస్తుల ఆర్థిక సహకారంతో బడిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, సాగుకు యోగ్యం గా ఉండేందుకు చెక్ డ్యామ్ లు నిర్మించుకున్నామని తెలిపారు. ఇరవై లక్షల రూపాయలతో గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రాన్ని, బస్ షెల్టర్ లను ప్రారంభించుకున్నామని, ఈనాడు ఫౌండేషన్ సహకారంతో డైనింగ్ హాల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. వృద్దులకు వృద్ధాప్య ఫించన్ వచ్చేలా సహకరించాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు బ్యాంకు ల ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం వచ్చిన నిధులను సాయి లింగి గ్రామానికి కేటాయించాలని, అట్టి నిధులతో భవన నిర్మాణం చేపడతామని కోరారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మాట్లాడుతూ, వృద్ధాశ్రమం ఏర్పాటుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్వచ్చంద సంస్థ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని, అలాగే తగిన సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, సర్పంచ్ రేవతి, ఎంపీటీసీ గౌరమ్మ, వయోవృద్ధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post