వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

వయో వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం రోజున సమావేశం నిర్వహించారు. మొదట జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ కారణంగా కార్యక్రమాలు నిర్వహించలేక పోయామని, ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలను సంబంధిత అధికారులు, ప్రజలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వయో వృద్ధుల న్యాయ పరమైన సహాయం కోసం ఇంటరాక్షన్ సెషన్ త్వరలో ఏర్పాటు చేయాలనీ సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కుటుంబాల లోని తగాదాలు, సమస్యలకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారికి పిటిషన్ సమర్పించాలని, అట్టి పిటిషన్ పై కూలంకషంగా విచారణ జరిపి న్యాయ పరమైన తీర్పును ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆదిలాబాద్, ఉట్నూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి పరిధిలో ఉన్న కేసులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కు కలెక్టర్ సూచించారు. వయో వృద్దులకు సంబందించిన చట్టం పై ప్రతి ఒక్కరికి అవగహన కలిగి ఉండాలని సూచించారు. చట్ట ప్రకారం వృద్దులకు మేలు చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయి ట్రిబ్యునల్ లో సీనియర్ సిటిజన్ లను సభ్యులను చేర్చడం పై పరిశీలిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా సీనియర్ సిటిజన్ గా తెలియపరచాలని కోరారు. 60 సంవత్సరాలకు పై బడిన వారు తప్పని సరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్ పై జరుగుచున్న ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. వయోవృద్ధులు సంబందించిన సమస్యలను హెల్ప్ లైన్ ద్వారా తెలియపరచ వచ్చని, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అంతకు ముందు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మాట్లాడుతూ, వయో వృద్ధుల సంక్షేమం కోసం నిర్దిష్ఠమైన చట్టం ఉందని, చట్ట ప్రకారం వారికీ దక్కవలసిన అన్ని సదుపాయాలను సమకూర్చడం వారి కుటుంబ సభ్యులపై ఉంటుందని లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, కోవిడ్, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా 60 సంవత్సరాలకు పై బడిన వారందరు జాగ్రత్తగా ఉండాలని, వృద్దులకు ఇమ్యూనిటీ తక్కువ గా ఉంటుందని కనుక ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇంటినుండి బయటకి రాలేని వారికీ కోవిడ్ వ్యాక్సిన్ కోసం కంట్రోల్ నంబర్ కు ఫోన్ చేసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అధిక రక్త పోటు, మధుమేహం, హృదయ సంబంధ, కిడ్నీ, తదితర వ్యాధితో బాధపడుతున్న వారుకూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని, అదేవిధంగా గర్భవతులు, బాలింతలు కూడా వ్యాక్సిన్ తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు కాస్తల సుధాకర్ మాట్లాడుతూ, వృద్ధులను పూజించాలని, ఆరాధించాలని, వారికీ సేవలు చేయడం పుణ్యం గా భావించాలని అన్నారు. వృద్ధుల సంక్షేమ చట్టం పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పోలీస్ ల సహకారంతో కుటుంబాల తగాదాలు తీరుతున్నాయని తెలిపారు. వృద్ధుల సమస్యలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ ను కోరారు. అనంతరం ఎనిమిది మంది వృద్ధులను శాలువా, మెమొంటో, పూలమాలలతో కలెక్టర్ సత్కరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, వయోవృద్ధుల సంఘం సభ్యులు, వయో వృద్దులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post