వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

వేములవాడ, నవంబర్ 8: వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో చేపడుతున్న అభివృద్ధి పనుల మిగులు చిన్న చిన్న పనులు వెంటనే పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టర్ వేములవాడలో పర్యటించి, ప్రాంతీయ ఆసుపత్రి, ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణ స్థలము, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న పాలియేటివ్ కేర్ యూనిట్ పనులు పూర్తయినట్లు, దీని నిర్వహణను తెలంగాణ వి హబ్ కు అప్పగించనున్నట్లు తెలిపారు. వి హబ్ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తకు బాధ్యతలు ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా వారికి ప్రారంభం నుండి నిర్వహణ వరకు అన్ని విధాలా వి హబ్ నుండి సహకారం ఉంటుందన్నారు. ఆక్సిజన్ ప్లాంట్, పిల్లల వార్డ్, 100 పడకల ఆక్సిజన్ పైప్ లైన్ పనుల ఆయన పరిశీలించారు. పనులు పూర్తయినట్లు, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన అన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోని స్థలాన్ని ఆయన పరిశీలించారు. వేములవాడ డివిజన్ కేంద్రంగా ఏర్పడినందున ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి స్థలం అనుకూలతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం తనిఖీచేసి, వసతులకల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. మౌళిక వసతుల కల్పనతో విద్యార్థినులు చదువులో రాణిస్తారన్నారు. అదనపు తరగతి గదులు నిర్మాణాల పురోగతి పరిశీలించారు. విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటాలని, పచ్చదనం పెంచాలని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మహేష్, మునిసిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్, మండల తహసీల్దార్ మునిందర్, అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post