వేసవి సీజన్ అయినందున అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు.
శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, టెన్త్, ఇంటర్, డిగ్రీ వార్షిక పరీక్షల నిర్వహణ, పోడు భూములకు పట్టాల పంపిణీ, జీ.ఓ నెం.లు 58 , 59 , 76, 118 అమలు, తెలంగాణకు హరితహారం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలను చేర్చడం తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ కీలక సూచనలు చేశారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలను సి.ఎస్ ఉటంకిస్తూ, ఈ తరహా ప్రమాదాలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలు, భవనాలు, వివిధ సంస్థలను గుర్తిస్తూ అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలన్నారు. కాగా, ఆరోగ్య మహిళా, కంటి వెలుగు కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోందని, వీటి ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలందేలా చొరవ చూపాలన్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాలను ఆన్ లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ ప్రక్రియలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, మొక్కల సంరక్షణ, క్రమం తప్పకుండా నీటిని అందించడంపై దృష్టి సారించాలన్నారు. పాడైపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు అందుబాటులోకి వచ్చిన జిల్లాలలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ఐ.డీ.ఓ.సీ ల్లోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏప్రిల్ మాసం నుండి అద్దె నిలిపివేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్మీడియట్ తో పాటు టెన్త్, డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, నిశిత పర్యవేక్షణ జరపాలని సి.ఎస్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ జిల్లాలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున ఈ నెల చివరి నాటికి జీ.ఓ నెం.లు 58 59 , 76, 118 అమలు చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ సజావుగా సాగుతుందని తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని, జిల్లాలో 226 పరీక్షా కేంద్రాల ద్వారా 49,574 మంది రెగ్యులర్ విద్యార్థులు, 729 మంది సప్లమెంటరీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 34 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని, పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లకు చర్యలు చేపట్టమని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని సూచించమని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి ఒక ఎ.ఎన్.ఎమ్ ను కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని, విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించమని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంక్యా నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి రామేశ్వరి దేవి, యస్.సి.డెవలప్మెంట్ అధికారి రామరావ్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.