వైద్యం విషయంలో హైదరాబాద్ నగరం లోని పేద ప్రజలు మరియు చుట్టుప్రక్కల జిల్లాలలోని ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దృష్టితో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ నగరానికి నలువైపులా 4 సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు మంజూరి చేశారని, అవి గచ్చ్చిబౌలి లో టీమ్స్ ను కోవిద్ సమయంలో ఏర్పాటు చేశారని మిగితావి ఛాతి ఆసుపత్రి ఆవరణలోని, ఆల్వాల్ లోను మూడవది గడ్డి అన్నారం లోను ఏర్పాటు చేయుటకు నిర్ణయించడమైనదని రోడ్లు భవనాల శాఖా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
మంగళవారం నాడు మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించుటకు ఛాతి ఆసుపత్రిని మరియు ఆల్వాల్ లోని భారతీయ విద్య భవన ప్రాంగణాన్నిసందర్శించారు. వీరు అక్కడి పరిస్థితులను పరిశీలించి త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు.సీఎం కెసిఆర్ ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆర్ బి శాఖకు ఇచ్చి వాటి నిర్మాణాన్ని చేపట్ట వలసినదిగా కోరారని తెలిపారు. హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వీటి నిర్మాణ భాద్యతను మాకు అప్పగించినందుకు వారికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఛాతి ఆసుపత్రి సందర్శనలో పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, స్థానిక కార్పొరేటర్లు, డిఎమ్ఈ రమేష్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆల్వాల్ ని భారతీయ విద్య భవన్ ప్రాంగణంలో ఆసుపత్రి పరిశీలనలో కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, కలెక్టర్ శ్వేతా మొహంతి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.